ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (10:17 IST)

అశోకగజపతి రాజుపై కేసు ... ఐపీసీ 473, 353 సెక్షన్ల కింద

కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రామతీర్థం బోడికొండ ఆలయ ధర్మకర్త అశోకగజపతి రాజుపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కేసులో ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అశోకగజపతిరాజుకు మధ్య వివాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా నెలిమర్ల పోలీసులు అశోకగజపతి రాజుపై ఐపీసీ 473, 353 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 
 
బుధవారం విజయనగరం జిల్లా నెలిమర్లలో రామాలయ పునర్‌నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి వెల్లంపల్లితోపాటు అశోకగజపతి రాజు కూడా వచ్చారు. ఈ ఆలయ శంకుస్థాపనకు తనను కొబ్బరికాయ కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. 
 
ఇదేసమయంలో శిలాఫలకం బోర్డును తొలగించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు సాయంతో మంత్రులు శిలాఫలకం ఏర్పాటుచేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి, విధులకు ఆటంకం కలిగంచారని ఆలయ ఈవో ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అశోకగజపతి రాజుపై కేసు నమోదు చేశారు. 
 
ఈ వ్యవహారంపై మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, ఆలయ ధర్మకర్తగా అశోకగజపతి రాజును ఆహ్వానించడం జరిగిందన్నారు. ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎక్కడా ప్రోటోకాల్ తప్పలేదని స్పష్టంచేశారు. అయితే, ఈ కార్యక్రమానికి రావడం అశోకగజపతి రాజుకు ఇష్టంలేనట్టుగా ఉందని అందుకే గంటముందే చేరుకుని వీరంగ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.