శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 18 జనవరి 2020 (21:30 IST)

ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్క‌లు వేయించండి

రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రోగనిరోధక దినోత్సవం (యన్‌ఐడి) జరుపుకుంటున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మరియు మిషన్ డైరెక్టరు వి.గీతాప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి చేతులు మీదుగా ముఖ్యమంత్రి నివాసంలో ఆదివారం ఉదయం 10.45గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

వైద్య, ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమం, పట్టణ పురపాలక శాఖ, మెప్మా, విద్యుత్తు, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, రవాణా, విద్యా శాఖలు సమన్వయంతో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల 27 వేల 431 మంది పిల్లలకు పోలియో వైరస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు.

ఇందుకోసం ఒక లక్షా 49 వేల 977 మంది ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు ఆధ్వర్యంలో 37 వేల 493 పోలియో బూత్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే సంబంధిత సిబ్బందికి శిక్షణను కూడా పూర్తి చేసామ‌న్నారు. బివాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (బిఓ పివి) వ్యాక్సిన్‌ను ఉపయోగిస్తున్నామని, ఇందుకోసం 65.75 లక్షల పరిమాణంలో మోతాదులను సిద్ధం చేయడం జరిగిందన్నారు.

ప్రయాణంలో ఉండే వారికోసం 1354 మొబైల్ బృందాలను బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్యకూడళ్లలో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. హైరిస్క్ జోన్ లలో భాగంగా 5209 ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, వీటిలో మురికివాడలు, నిర్మాణస్థలాలు, ఇటుకబట్టీలు, వలస వ్యవసాయ కార్మికులు, మత్స్యకార సంఘాల వంటివి గుర్తించామన్నారు.

వీటిద్వారా 93 వేల 430 మందికి పైగా పిల్లలకు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 2700 మంది జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్రస్థాయిలో 13 మంది ఉన్నతస్థాయి అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 11 సంవత్సరాల్లో ఒక్క పోలియో కేసుకూడా నమోదు కాలేదని తెలిపారు.

సూక్ష్మకార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని రాష్ట్ర స్థాయి నుండి క్షేత్రస్థాయిలోని గ్రామస్థాయి వరకు ఉన్న ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 19న పోలియో వ్యాక్సిన్ తీసుకోలేకపోయిన పిల్లల కోసం ఈ నెల 20 నుండి 22 వరకు ఇంటింటికీ సిబ్బంది తిరిగి వ్యాక్సినేషన్ అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్న‌ట్లు గీతాప్రసాద్ తెలిపారు.