చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా లక్షణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీంతో హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో కరణం బలరాం చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతను కూడా హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు.
మరోవైపు ఇదే జిల్లాలోని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నం వెంకట రాంబాబు దంపతులు కూడా కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. గత రెండు రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో తన భార్యతో కలిసి ఒంగోలులోని రమేశ్ సంఘమిత్ర ఆసుపత్రిలో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. ఇతర కుటుంబ సభ్యులకు కోవిడ్ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్‌గా తేలింది.
కాగా, ఇటీవల ఎమ్మెల్యే పుట్టినరోజు జరిగింది. ఈ వేడుకలో ఆయన పాల్గొన్నారు. దీంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు, నెల రోజుల క్రితం రాంబాబు మనవడికి పాజిటివ్ వచ్చింది. ఆయన ఒంగోలులో చికిత్స పొందారు.
మాజీ సీఎం సిద్ధరామయ్య కరోనా
తనకు కరోనా సోకిందని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాద్వారా వెల్లడించారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతోపాటు ఆయన కుమార్తె పద్మావతి కూడా కరోనా బారినపడగా, కుమారుడు విజయేంద్రకు మాత్రం నెగటివ్‌గా నిర్ధారణ అయింది.
ఇపుడు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కరోనా వైరస్ కోరల్లో చిక్కారు. అయితే, వైద్యుల సూచన మేరకు తాను ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. ఇటీవల తనతో కలిసిన వారిలో ఎవరికైనా వైరల్ లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. సిద్ధరామయ్యకు సోమవారం జ్వరంగా ఉండడంతో కరోనా యాంటీజెన్ పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని సిద్ధరామయ్య కుమారుడు తెలిపారు.
కాగా, సిద్ధరామయ్య త్వరగా కోలుకోవాలంటూ కరోనా బారినపడిన ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, జనతా దళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ ఆకాంక్షించారు. అలాగే, యడ్యూరప్ప కార్యాలయంలోని ఆరుగురు సిబ్బందికి కూడా సోమవారం కరోనా సోకింది.