శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జులై 2020 (13:53 IST)

తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ఈ రాష్ట్రంలో కొత్త పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్నాయి. ఈ కేసుల నమోదుతో పాటు.. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న టెస్టులపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలన్నీ ఆ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా వైరస్ సోకింది. 
 
మంగళవారం వరకు ఆయన హోం ఐసొలేషన్‌లోనే ఉన్నారు. ఆయనకు పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఆయన భార్య, కుమారుడు, పనిమనిషికి కూడా కరోనా సోకింది.
 
కాగా, తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. ఇలాంటి వారిలో మాజీ ఎంపీ, వృద్ధ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ఉన్నారు. అలాగే, అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.