ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జూన్ 2024 (14:22 IST)

థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.. చంపేందుకు ప్రయత్నించారు : ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు

raghurama krishnamraju
గత 2021లో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఏపీ పోలీసులు సీఐడీ అధికారులతో కలిసి తనను కస్టడీలో హింసించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, గుండె శస్త్రచికిత్స చేసుకున్నానని చెప్పినా, మందులివ్వకుండా నిరాకరించి, చంపేందుకు ప్రయత్నించారంటూ ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, ఆర్.విజయపాల్, గుంటూరు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, ఇతర అధికారుల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలను నిరూపించే ఆధారాలన్నీ సమర్పిస్తున్నట్టు తెలిపారు. జగన్‌‍తో ఆ అధికారులందరిపై హత్యాయత్నం కేసు పెట్టి, నాకు న్యాయం చేయండి అని ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికైన కె.రఘురామకృష్ణరాజు కోరారు. 
 
జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన హక్కులను కాలరాశారని, ఇందులో నాటి సీఎం జగన్, పోలీసు అధికారుల కుట్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గుంటూరు ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు. అందులో పేర్కొన్న ప్రకారం.. ఇది ఖచ్చితంగా హత్యాయత్నమే 2021 మే 14న సీఐడీ అధికారులు నాపై ఓ తప్పుడు కేసు పెట్టారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో నన్ను అరెస్టు చేశారు. న్యాయసూత్రాల ప్రకారం వైద్య పరీక్షలు చేయించాక, అక్కడే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అలాకాకుండా బలవంతంగా నెట్టుకుంటూ పోలీసు వాహనంలో ఎక్కించుకొని రాత్రి 9.30కు గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. 
 
అంతకు కొద్దివారాల క్రితమే గుండెకు శస్త్రచికిత్స చేయించుకుని ఇంట్లో కోలుకుంటున్న దశలో ఆ రాత్రి నాకు మంచినీళ్లు, మందులు ఇవ్వలేదు. నేను ఎంపీని అయినప్పటికీ అరెస్టుకు ముందు లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన వై కేటగిరీ పోలీసు భద్రతను లేకుండా చేసి, రాత్రి సీఐడీ కస్టడీలో హింసించారు. రాత్రి 11.30కు సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, ఇతర పోలీసులు వచ్చి నా కాళ్లను తాళ్లతో కట్టేసి కదలనివ్వకుండా చేశారు. రబ్బరు బెల్ట్, లాఠీలు, ఇతర ఆయుధాలతో అరగంట పాటు కొట్టారు. పాదాల్లోంచి రక్తం కారుతూ నొప్పి పుట్టడంతో ఏడ్చాను. ఆ రాత్రంతా ఐదు సార్లు ఇలాగే కొట్టారు. దుర్భాషలాడారు. జగన్‌ను విమర్శిస్తున్నందుకు చంపేస్తానని సునీల్ కుమార్ నేరుగా బెదిరించారు. 
 
హింసిస్తున్న వీడియోను ఓ అధికారి సీఎం జగన్‌కు చూపించారు. మరో పోలీసు అధికారి కింద కూర్చొని నా గుండెపై బాదుతూ, చంపేసి.. గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నా ఫోన్ పాస్‌వర్డ్ చెప్పేవరకూ కొట్టారు. మంచం మీద కూర్చోబెట్టి కొట్టగా, ఆ మంచం విరిగిపోయింది. ఈ దురాగతానికి పాల్పడ్డ అధికారులను గుర్తించగలను అంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇపుడు ఈ ఫిర్యాదు అంశం చర్చనీయాంశంగా మారింది.