బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (08:20 IST)

సివిల్‌ సప్లయిస్ డోర్ డెలివరీ వాహనాలకు రివర్స్‌ టెండరింగ్‌

ప్రజాధనం ఆదా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రివర్స్‌ టెండరింగ్ వల్ల సివిల్ సప్లయిస్ డోర్ డెలివరీ వాహనాల కొనుగోళ్ళలో సుమారు రూ.63 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులను ప్రజల ఇళ్ల వద్దకు తీసుకువెళ్ళి, అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు సివిల్ సప్లయిస్ 9260 డోర్ డెలివరీ వాహనాలను కొనుగోలు టెండర్లను ఆహ్వానించింది. టెండర్లలో సుజుకీ, టాటామోటార్స్‌ వంటి సంస్థలు బిడ్‌లను దాఖలు చేశాయి. ఈ బిడ్‌లపై గత రెండు వారాల కిందటే జ్యుడీషయల్ ప్రివ్యూ కూడా పూర్తయ్యింది.

అయితే రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ కోట్ చేసే సంస్థకు టెండర్ ఇవ్వడం ద్వారా ప్రజాధనంను ఆదా చేయాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సివిల్ సప్లయిస్ కమిషన్ అండ్ ఎక్స్‌అఫీషియో సెక్రటరీ కోన శశిధర్ ఆధ్వర్యంలో రివర్స్ టెండరింగ్ నిర్వహించారు.

అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ కొనసాగించాలన్న సీఎం ఆదేశాలతో కేంద్రప్రభుత్వ పరిధిలోని ప్రతిష్టాత్మక గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ (గెమ్) పోర్టల్‌లో నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌ లో టాటామోటార్స్ సంస్థ సుజుకీ సంస్థ కన్నా తక్కువ రేట్‌ కోట్ చేసి బిడ్‌ను దక్కించుకుంది.

ప్రారంభంలో ఒక్కో వాహనానికి రూ.6.60 లక్షలు కోట్ చేసిన టాటా మోటార్స్ రివర్స్‌ బిడ్డింగ్ లో రూ. 5,72,539 లక్షలకు రేట్‌ను తగ్గించుకుంది.

దీనివల్ల ఒక్కో వాహనంపై సుమారు రూ.67,460 రూపాయల వరకు తగ్గింది. పోటీ సంస్థ కన్నా తక్కువకు వాహనాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో టాటామోటార్స్‌ బిడ్‌కు అధికారులు ఆమోదం తెలిపారు.