మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (16:36 IST)

దూర ప్రాంత ప్రయాణీకులకు మరిన్ని బస్సు సర్వీసులు కల్పించాలి: ఎమ్మెల్యే మేకా

నూజివీడు ప్రజలకు దూర ప్రాంత ప్రయాణాలకు మరిన్ని సౌకర్యవంతమైన బస్సు సర్వీసులు కల్పించాలని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆర్టీసీ అధికారులకు సూచించారు. నూజివీడు నుండి కాకినాడకు లగ్జరీ బస్సు సర్వీస్‌ను స్థానిక బస్సు స్టేషనులో గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. నూజివీడు డిపో నుండి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల సంఖ్య పెరిగిందని, అందుకు తగిన విధంగా బస్సు సర్వీసులను పెంచాలన్నారు. ప్రైవేట్ బస్సులకు ధీటుగా సౌకర్యవంతమైన బస్సు సర్వీసులను ప్రజలకు కల్పించాలన్నారు. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికీ ఉద్యోగ భద్రత కల్పించారన్నారు. ప్రయాణీకులకు మంచి సేవలందించడం ద్వారా సంస్థను లాభాల బాటలో నిలిపి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. బస్టాండ్‌లో ప్రయాణీకులకు త్రాగునీరు, సౌకర్యవంతమైన కుర్చీలు, పరిశుభ్రమైన టాయిలెట్లు, వంటి సౌకర్యాలు అందించాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని వివిధ బస్సు స్టాప్‌ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. 
 
డిపో మేనేజర్ ధీరజ్ మాట్లాడుతూ నూజివీడు - కాకినాడ మధ్య ప్రతీరోజు ఒక లగ్జరీ బస్సు బస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బస్సు సర్వీస్ ప్రతీరోజు ఉదయం 8.15ని.లకు నూజివీడు నుండి బయలుదేరి, మధ్యాహ్నం 1.30 నిలకు కాకినాడ చేరుకుంటుందన్నారు. అనంతరం కాకినాడ నుండి మధ్యాహ్నం 2.15నిలకు బయలుదేరి, రాత్రి 7.30 నిలకు నూజివీడు చేరుకుంటుందన్నారు. 
 
ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, కౌన్సిలర్లు పగడాల సత్యనారాయణ, అశోక్, శీలం రాము, ప్రభృతులు పాల్గొన్నారు.