శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (05:18 IST)

పింఛన్ దారుల కళ్ళల్లో సంతృప్తి: మంత్రి పేర్ని నాని

లబ్ధిదారులకు పింఛన్ డబ్బు ఉదయాన్నే అందడంతో వారి కళ్ళల్లో సంతృప్తి స్పష్టంగా కనిపించిందని, గడప వద్దకే పెన్షన్లు సందర్భంగా గత ఫిబ్రవరి నెలలో ఎదురైన సమస్యలను అధికారులు సమర్థవంతంగా అధిగమించారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రశంసించారు.

ఆయన బందరు మండలం పొట్లపాలెం గ్రామ పంచాయతీలో పలువురు అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 58,44,642 పెన్షన్లలో ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు 45.24 లక్షలు పంపిణీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల ద్వారా అందించడం జరిగిందని, పెన్షన్ల పంపిణీపై రియల్‌ టైం డేటాను రూపొందించి జిల్లాల్లో ప్రత్యేక సెల్‌ల ఏర్పాటు, నిరంతర పర్యవేక్షణ అమలు జరిగిందన్నారు. 

గతంలో పెన్షన్లు కోసం క్యూలో నిలబడి రోజంతా ఒకోసారి నిరీక్షించాల్సి వచ్చేదని, మధ్యవర్తుల ప్రమేయం ఉండేదని, పెన్షన్ల కింద ఇచ్చే సొమ్ములో సైతం అవినీతికి పాల్పడేవారని, ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవంటూ నేరుగా అందడం ఒక మంచి శుభ పరిణామన్నారు.

అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికీ ఇంటివద్దకే పెన్షన్లు అందించడంతో వారు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిండుమనస్సుతో దీవిస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు.

కుల మతాలు , ప్రాంతాలు, వర్గాలు , పార్టీలు చూడకుండా ఓటు వేయని వారికి కూడా పథకాలు అందిస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్తిస్థాయిలో సంక్షేమ పధకాలు అందచేయడం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన ఘట్టం ఇదేనన్నారు.  

గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను విప్లవాత్మకంగా ప్రవేశపెట్టి ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించి వారు అత్యంత పారదర్శకరంగా జాబితాను తయారుచేసి, ఆ జాబితాలను గ్రామ సచివాలయాల్లో అతికించి సామాజిక తనిఖీలకోసం ప్రజలముందే పెట్టామని, అర్హులైనవారు మిగిలిపోతే ఎవర్ని ఎలా సంప్రదించాలి, ఎలా దరఖాస్తు చేయాలన్నదానిపై ఆ జాబితాలకిందే సమాచారం ఉంచామని మంత్రి పేర్ని నాని అన్నారు.

వార్డు వాలింటర్లు ఆయా కుటుంబ సభ్యుల వివరాలు అధ్యయనం చేసి చిత్తశుద్ధితో, పారదర్శకతతో మరింత సమర్థవంతంగా పథకాలు అమలు జరిగేలా చూడాలని సూచించారు.

మూడెకరాల మాగాణీ వ్యవసాయ భూమి ఉన్నవారికి పింఛన్, రేషన్ కార్డు మంజూరు కాదని, 2.50 లక్షల రూపాయల సంవత్సర ఆదాయం ఉన్నవారి పిల్లలకు జగనన్న ఫీజు రీయంబర్స్మెంట్ కు అర్హులని, అలాగే 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి డాక్టర్ వైస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులని ప్రతి ఒక్కరికి వాలంటీర్లు అవగాహన కల్పించి ఆయా వివరాలు  తెలియచేయాలని మంత్రి తెలిపారు.

ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే ఆందోళన వద్దని మంత్రి పేర్ని నాని స్పష్టంచేశారు. ఎలాంటి సమస్య ఉన్నా గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాలని, ఎవరెవరు అర్హులో గ్రామ సచివాలయాల్లో ఆ వివరాలు గోడకు అతికించేరని, అందులో పొందుపర్చిన  ఆ వివరాలు సమర్పించి తిరిగి  దరఖాస్తు చేసుకోవచ్చని, వీటిని అధికారులు 5 రోజుల్లో పరిశీలించి, అర్హులైనవారికి మంజూరు చేస్తారని మంత్రి  పేర్ని నాని పేర్కొన్నారు.