ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (05:09 IST)

పెన్షన్ల పంపిణీలో ఏపీ సర్కార్‌ రికార్డు

ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీలో ఏపీ సర్కార్‌ మరో రికార్డు నెలకొల్పింది. సీఎం జగన్ ఆదేశాలతో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంది.

పెన్షన్ల కోసం పడిగాపులు, క్యూలైన్లు, అలసత్వానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం చెక్‌ పెట్టింది. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల వ్యవస్థ సత్తాచాటింది. పొద్దు పొడవకముందే పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు.

మారుమూల ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీపై ముందస్తు సన్నాహాలు చేశారు. ఒకటోతేదీ ఆదివారమైనా లబ్ధిదారులకు నగదు అందింది. గడపవద్దకే పెన్షన్లు సందర్భంగా తొలినెల(ఫిబ్రవరి–2020)లో ఎదురైన సమస్యలకు అధికారులు చెక్‌  పెట్టారు.

ఇంటివద్దకే వాలంటీర్లు, లబ్ధిదారుల చేతిలో నగదు అందింది. దీంతో పెన్షన్లర్లు ఆనందం వ్యక్తం చేశారు. 58,44,642 పెన్షన్లలో మధ్యాహ్నం 1 గంటలకు 45.24 లక్షలు పంపిణీ  చేశారు.

అర్హులైన అందనివారికి, వెరిఫికేషన్‌ పూర్తైన వారికి ఒకేసారి రూ.4,500 అందించారు. పెన్షన్ల పంపిణీపై రియల్‌ టైం డేటాను రూపొందించారు. జిల్లాల్లో ప్రత్యేక సెల్‌ల ఏర్పాటు, నిరంతర పర్యవేక్షణ తొలినెలలో ఎదురైన సమస్యలకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది. 
 
అయితే పెన్షన్‌దారులు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు పెదవి విరుస్తున్నారు. గతంలో ఇంటింటికి రేషన్ అందించాలని ప్రభుత్వం భావించింది. అనుకున్నట్లు గానే వాలంటీరీ వ్యవస్థను కూడా సిద్ధం చేసింది.

అయితే మొదటి నెల మాత్రమే ఇంటింటికి రేషన్‌ను సరఫరా చేశారు. రేషన్ సరుకులు తీసుకోవడానికి వేలిముద్రలు తీసుకుని రేషన్ ఇస్తారు. సాంకేతిక సమస్యలు రావడంతో కొందరికి వేలిముద్రలు పడడం లేదు.

దీంతో వారికి ప్రస్తుతానికి రేషన్ అందలేదు. రేషన్ బియ్యంలాగే తమకు కూడా ఇలాంటి సమస్యలు వస్తే ఏంటని పెన్షన్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఏడు లక్షల పెన్షన్లు తొలగించి ఉసురుపోసుకున్నారు: కళా వెంకట్రావ్‌
పెన్షన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ నేత కళా వెంకట్రావ్‌ ఆరోపించారు. అబద్దపు ప్రచారానికి ప్రజాధనం దుర్వినియోగం చేయడం సిగ్గుచేటని అన్నారు.

తప్పుడు రప్రకటనలు ఇస్తే అధికారులపై లీగల్‌ చర్యలు తప్పవని అన్నారు. టీడీపీ ప్రభుత్వం డయాలసిస్‌ రోగులకు 2,500 రూపాయలు ఇస్తే శనివారం ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలో మాత్రం నిల్‌ అని చూపారన్నారు.

మాట తప్పడం, మడమ తిప్పడం వైసీపీకి పుట్టుకతో వచ్చిన గుణం ఆయన విమర్శించారు. చివరికి హిజ్రాల పెన్షన్లను కూడా రద్దుచేయడం సిగ్గుచేటని అన్నారు. ఏడు లక్షల పెన్షన్లు తొలగించి వారి ఉసురుపోసుకున్నారని విమర్శించారు.