నటీనటులు : కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా, వి రవిచంద్రన్, రావు రమేష్, వైవా హర్ష, అచ్యుత్, సత్య తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫీ : కే కే సెంథిల్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత :రజినీ కొర్రపాటి, సాయి కొర్రపాటి, ఎడిటర్ : నిరంజన్ దేవరమనే, దర్శకత్వం: రాధా కృష్ణ రెడ్డి
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతూ శ్రీలీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమానే “జూనియర్”. చాలాకాలం తర్వాత జెనీలియా కూడా నటించింది. అక్కా, తమ్ముడు సెంటిమెంట్ కథగా ముందుగానే పబ్లిసిటీ చేసేశారు. సీనియర్స్ సాంకేతిక సిబ్బంది కూడా పనిచేశారు. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
విజయనగరం అనే గ్రామంలో కోదండపాణి (వి రవిచంద్రన్), భార్య శ్యామల సంతానమే అభినవ్ (కిరీటి). అభి పుట్టకముందే ఊరు విడిచి సిటీ వచ్చేస్తాడు కోదండపాణి. అభి చురుకైన, తెలివితేటలు వున్న వ్యక్తి. సిటీలో కాలేజీ చదువుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ, ప్రతీది మెమెరిలా వుండేలా ఆలోచిస్తాడు. అతనికి ముగ్గురు స్నేహితులు. కాలేజీ అమ్మాయి స్ఫూర్తి (శ్రీలీల) ని తొలిచూపుతో ప్రేమలో పడిపోయి ఆమెను ఫాలోచేస్తుంటాడు. తన కెరీర్ కోసం రైస్ సొల్యూషన్స్ లో ఉద్యోగం చేస్తూ విదేశాలకు వెళ్ళాలనేది స్పూర్తి ఆలోచన. అందుకే ఆమె జాబ్ కంపెనీలోనే జాయిన్ అవుతాడు.
ఆ కంపెనీలో జాయిన్ అయిన రోజే కంపెనీకి కాబోయే సీఈఓ విజయ సౌజన్య (జెనీలియా) అభికి పనిష్మెంట్ ఇస్తుంది. అందుకు రివెంజ్ గా విజయ సి.ఇ.ఓ. అయ్యే రోజు తన టెక్నికల్ నాలెడ్జ్ తో ఆమె సీ.ఈ.ఓ. కాకుండా గేమ్ ఆడతాడు. అసలే కోపిష్టి అయిన విజయ అతని ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. ఆ తర్వాత విషయమంతా తెలుసుకున్న సీ.ఇ.ఓ. అయిన విజయ తండ్రి రావురమేష్.. అభిని పిలిచి ఓ రహస్యాన్ని రిలీవ్ చేస్తాడు? అది ఏమిటి? అభిని విజయ ఎందుకు పనిష్మెంట్ ఇచ్చింది? ఆ తర్వాత కథ ఎటువైపు మలుపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
జూనియర్ చిత్ర కథ కొత్తదేమీ కాదు. సన్నివేశాలు, సందర్భాలు దర్శకుడు కొత్తగా రాసుకున్నాడు. విలేజ్ నుంచి ఎంచుకున్న పాయింట్ లోనే లేట్ వయస్సులో తల్లిదండ్రులు కావడం అనేది కొత్తగా ఇప్పటి జనరేషన్ కు అనిపిస్తుంది. ఎలాగూ ఏజ్ గేప్ తో తండ్రి, కొడుకులు ఎలా వుంటారనేది కూడా బాగానే చూపించాడు. ఈ క్రమంలో కాలేజీలో చురుగ్గా వుండే అభి తన అభినయంతోనూ, యాక్షన్ సన్నివేశాలతోనూ, డాన్స్ పరంగా ప్రేక్షకులకు వావ్.. అనిపించేలా చేశాడు. కాలేజీలో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్.. అల్లు అర్జున్ చేసే సినిమాలనూ, జాకీ జాన్ చేసే సీన్స్ ను ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ బాగా మిక్స్ చేసి చూపించాడు. ఓ దశలో డైలాగ్ పరంగా, చురుకుదనంగా కథానాయకుడు రామ్ ను గుర్తుకు తెస్తాడు. ఎన్.టి.ఆర్.ను ఓ చోట పోలికగా చూపిస్తాడు. కిరిటీ చురుకుదనం, నటన, డాన్స్ పరంగా తొలి సినిమాకే కిరీటాన్ని పెట్టుకునేలా పేరు సంపాదించుకున్నాడనే చెప్పాలి.
ఇక శ్రీలీల పాత్ర పరిమతంగానే వుంది. ఆమెతోపాటు, స్నేహితులైన వైవాహర్ష, సత్య లతో వచ్చే సన్నివేశాలు శ్రీమంతుడు సినిమా ను ఇంచుమించుకుగా పోలివుంటాయి. ప్రతిసారా ఫెయిల్ అవుతూ పాస్ మార్క్ ల కోసం చాలాకాలం కుస్తీపడుతున్న వైవా హర్ష చేత ఫస్ట్ ర్యాంక్ తెచ్చేలా అభి చేసిన విన్యాసం అలాంటిదే. ప్రత్యేకంగా చెప్పకోవాల్సింది జెనీలియా పాత్ర. సీరియస్ గా వుంటూ ముభావంగా వుండే పాత్రలో ఇమిడిపోయింది. ఎందుకలా వుందనేందుకు తెలుసుకోవాలంటే సెకండాఫ్ లో వచ్చే కథంతా ఆమెపైనే వుంటుంది. మిగిలిన పాత్రలు మామూలుగానే తమ పాత్రలకు న్యాయంచేసేవిగా వుంటాయి.
టెక్నికల్ గా చూస్తే, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ హైలైట్. యాక్ష న్ సన్నివేశాల్లో ఎక్కడా ఎక్కువ తక్కువ కాకుండా లైటింగ్ తో బాగా మేనేజ్ చేశాడు. అలాగే సంగీతపరంగా దేవీశ్రీప్రసాద్ చేసిన బాణీలు కొత్తగా లేకపోయినా వినడానికి బాగున్నాయి. డాన్సర్ అయిన శ్రీలీలతో అభి చేసే ఐటెం సాంగ్ లో ఇద్దరూ పోటీపడి నటించారు. ఎడింటింగ్ లో కాస్త ముందు వెనుక సన్నివేశాలు చూసుకుంటే బాగుండేది.
మైనస్ పాయింట్స్ గా చెప్పాలంటే.. హీరోగా తన కొడుకు నిలబెట్టేందుకు తండ్రి గాలి జనార్దన్ రెడ్డి చేసిన ప్రయత్నం కొనియాడదగిందే. అయితే కథ పరకంగా ఇంకాస్త కొత్తదనం చూపిస్తే సినిమా మరో లెవల్లో వుండేది. డబ్బింగ్ లోనూ కాంప్రమైజ్ కాకుండా చూసుకోవడం విశేషం. రావురమేష్, రవిచంద్రన్ అన్నదమ్ములు. రవిచంద్రన్ కొడుకు అభి. అయితే ఓ సందర్భంలో మీ నాన్న నా స్నేహితుడు అంటూ పదప్రయోగం చేస్తాడు. ఇలా చిన్నచిన్న తప్పులు కూడా సరిచూసుకుంటే బాగుండేది. ఏది ఏమైనా హీరోను లోకానికి చూపించేందుకు చేసిన తొలి ప్రయత్నం ఓకే అనిపించేలా వుంది చిన్నపాటి లోపాలున్నాయి. వాటిని రెండో ప్రయత్నంగా సరిచేసుకుని మంచి కథతో ముందుకు వస్తే కిరిటీ మంచిపేరు తెచ్చుకుంటాడు.
రేటింగ్: 3/5