మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (21:27 IST)

శ‌భాష్.. జ‌గ‌న్‌.. ప్రపంచ బ్యాంకు బృందం ప్ర‌శంస‌లు

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలు కురిపించింది. 
 
మానవవనరులపై పెట్టుబడులద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, వాస్తవిక అభివృద్ధి సిద్ధిస్తుందని వ్యాఖ్యానించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయ్యింది.

దక్షిణాసియా మానవ వ‌నరుల విభాగం రీజినల్‌ డైరెక్టర్‌ షెర్‌బర్న్‌ బెంజ్‌ నేతృత్వంలో వరల్డ్‌ బ్యాంకు బృందం ముఖ్యమంత్రితో చర్చలు జరిపింది. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను సీఎం వివరించారు.

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ చేసిన పాదయాత్రను ప్రపంచబ్యాంకు బృందం ప్రస్తావించింది. ఆరోగ్యం, విద్య, సహా పలు రంగాల్లో సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించింది. విద్య, వైద్యం, సామాజిక భద్రత అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన విధంగా సహాయం చేస్తామంది.

వచ్చే నాలుగు నెలలపాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేసి, ఏయే కార్యక్రమాలకు ప్రపంచబ్యాంకు నుంచి సహాయం అందించాలన్నదానిపై ఒక అవగాహనకు వస్తామని ప్రతినిధి బృందం స్పష్టంచేసింది. విప్లవాత్మక మార్పుల్లో భాగంగా గ్రామస్థాయినుంచి తీసుకున్న చర్యలను సీఎం సమగ్రంగా ప్రపంచబ్యాంకు బృందానికి వివరించారు.

పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం స్కూల్, దీని నుంచి మరో నాలుగు అడుగులు వేస్తే గ్రామ సచివాలయం, అక్కడనుంచి ఇంకో నాలుగు అడుగులు వేస్తే రైతు భరోసా కేంద్రం, అలాగే మరో నాలుగు అడుగులు వేస్తే వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ పేరిట ఏర్పాట చేస్తున్న సబ్‌ సెంటరు.. ఈ నాలుగూ గ్రామాల్లో సమగ్ర మార్పులను తీసుకువస్తాయని, గ్రామాల స్వరూపాలను మారుస్తాయని సీఎం వివరించారు.

విద్యార్థులు ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌న్న ల‌క్ష్యంతో అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఇంగ్లిష్ మాధ్య‌మాన్ని ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు సీఎం వివ‌రించారు. నాడు–నేడు ప‌థ‌కం ద్వారా పాఠ‌శాల‌లు, ఆస్ప‌త్రుల్లో స‌మూల మార్పులు తీసుకొచ్చేందుకు మూడేళ్ల ప్ర‌ణాళిక రూపొందించిన‌ట్లు చెప్పారు.  
 
వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌
వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ పేరిట హెల్త్‌ సబ్‌ సెంటర్లను ఏర్పాటు చేయ‌నున్నామని, 24 గంటలపాటు ఒక నర్సు, ఒక ఏఎన్‌ఎం అందుబాటులో ఉండేలా చేస్తున్నామని సీఎం చెప్పారు. 51 రకాల మందులను కూడా ఈ వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు.

సబ్‌సెంటర్‌ పరిధి దాటితే.. నేరుగా ఆ వ్యక్తిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వివరించారు. నర్స్‌ నేరుగా ఆస్పత్రికి రిఫర్‌ చేస్తే... వెంటనే ఆరోగ్యశ్రీ వర్తింపు చేసేలా అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు.

ఇప్పటికే ప.గో. జిల్లాల్లో 2వేల రోగాలకు పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నామని, ఏప్రిల్‌ నుంచి అన్నిజిల్లాల్లో ఇదే సంఖ్యలో రోగాలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తున్నామని వివరించారు. అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పతులను నాడు–నేడు కింద అభివృద్ధిచేస్తున్నామంటూ సీఎం వివరించారు.

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బోధనాసుపత్రి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పుడున్న‌ 11 టీచింగ్‌ ఆస్పత్రుల సంఖ్య‌ను 27కు పెంచుతున్నామని సీఎం వివరించారు. వాటర్‌ గ్రిడ్‌ ద్వారా రక్షిత తాగునీటిని అందించడానికి చేస్తున్న ప్రయత్నాలను సీఎం వివరించారు. 
 
రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అండగా...
రైతు భరోసాకేంద్రాల ద్వారా రైతులకు సహాయకారిగా నిలుస్తున్నామని సీఎం తెలిపారు. సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులే కాకుండా, ఈ– క్రాపింగ్, కల్తీలేని విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 
 
వీటికి ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుందన్నారు. రైతుల ఆదాయాలను పెంచడంలో రైతు భరోసాకేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను సీఎం వారికి వివరించారు.

ఇ– పాలన అంశాన్ని వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు గ్రామ, వార్డు సచివాలయాలన్నీ కూడా ఇంటర్నెట్‌ తో అనుసంధానం చేశామని, ఈ సచివాలయాలన్నీ కలెక్టర్‌ కార్యాలయం, సెక్రటేరియట్‌తో లింక్‌ అయిన అంశాన్ని వివరించారు. డేటా మొత్తం గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉంటుందని సీఎం వివరించినప్పుడు వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించారు.

ఇ–పాలన పారదర్శకతకు పెద్దపీట వేస్తుందని వ్యాఖ్యానించారు. వచ్చే మూడేళ్లలో భూముల రిజిస్ట్రేషన్‌ కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే నిర్వహిస్తామని వరల్డ్‌ బ్యాంకు బృందానికి సీఎం వెల్లడించారు. 
 
ఈచర్యల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనప్రమాణాలు, ఆదాయాలు పెరుగుతాయని, గ్రామాలను విడిచివెళ్లాలనే ఆలోచన తగ్గుతుందని, పట్టణాలకు వలసలు తగ్గడం ద్వారా, పట్టణాలపై ఒత్తిడి తగ్గుతుందని ముఖ్యమంత్రి ప్రపంచబ్యాంకు అధికారులకు వివరించారు.
 
స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కోసం చర్యలు:
రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న నైపుణ్యకేంద్రంపై ముఖ్యమంత్రి ప్రపంచబ్యాంకు బృందానికి వివరించారు. ఒక యూనివర్శిటీ పరిధిలో ఈ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే హై ఎండ్‌స్కిల్స్‌ కోసం విశాఖలో ఒకటి, మధ్యాంధ్రలో ఒకటి, రాయలసీమ జిల్లాల్లో ఒక కేంద్రాన్ని.. మొత్తంగా మూడు సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో టైర్‌–1 సిటీ లేదని, ఈ నైపుణ్యాలు అభివృద్ధి చెందితే.. టైర్‌–1 సిటీతో పోటీపడే పరిస్థితి వస్తుందన్నారు. లేకపోతే కాల్‌సెంటర్లు లాంటి వాటికి పరిమితం కావాల్సి వస్తుందన్నారు. పాఠ్యప్రణాళికలో తీసుకొస్తున్న మార్పులను, అప్రెంటిస్‌ను తప్పనిసరిచేస్తున్న విషయాన్నీ సీఎం వారికి వివరించారు. 
 
నైపుణ్యాభివృద్ధి కోసం చర్యలు
నైపుణ్యాభివృద్ధి కోసం సీఎం తీసుకుంటున్న చర్యలను వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు ప్రశంసించారు. ఒకేచోట కాకుండా పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కాలేజీల ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమన్నారు. దీనివల్ల పరిశ్రమలకు మరింత మేలు జరుగుతుందన్నారు. హైఎండ్ స్కిల్స్ కోసం ఏర్పాటు చేస్తున్న సంస్థల వల్ల మరింత మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. 
 
రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై చర్చ:
రాష్ట్ర సమగ్రాభివృద్ధికోసం, అన్ని ప్రాంతాలకూ సమన్యాయం కోసం ఇటీవల అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా సీఎం ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు వివరించారు. గడచిన ఐదేళ్లకాలంలో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం కోసం సుమారు రూ.5,674 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, సుమారు మరో రూ.3వేలకోట్లు బిల్లులను బకాయిలుగా పెట్టారన్నారు.

ఏటా రూ.6–7వేల కోట్లు పెడితే.. ఎప్పటికి పూర్తవుతుందని, ఖర్చు చేయాల్సిన రూ.1.09లక్షల కోట్లలో ఇది సముద్రంలో నీటిబిందువు మాదిరే అవుతుందని సీఎం వెల్లడించారు.

రాష్ట్రంలో విశాఖపట్నం నంబర్‌ ఒన్‌సిటీ అని, ఇప్పటికే అన్నిరకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అక్కడ పెట్టే ప్రతి రూపాయి కూడా ఆ నగరస్థాయిని మరింతగా పెంచుతుందని సీఎం వెల్లడించారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టేవారు ఆసక్తిచూపిస్తారని, భవిష్యత్తులో పెద్ద నగరాలతో పోటీపడే స్థాయికి చేరుకుంటామని సీఎం అన్నారు. 
 
ఉన్న‌త చదువులతో పేద‌రికం దూరం 
సామాజికంగా ఉన్న అసమతుల్య పరిస్థితులను ఏరకంగా ఎదుర్కొంటారని, దీనికి చేస్తున్న ఆలోచనలు ఏంటని ప్రపంచబ్యాంకు ప్రతినిధులు సీఎంను ఆరాతీశారు. పేదరికం నుంచి బయటకు రావాలంటే అది మంచి చదువులు ద్వారానే సాధ్యమని సీఎం పునరుద్ఘాటించారు. రష్యా స్ధాయిలో జీఈఆర్‌ రేషియోను తీసుకెళ్తామన్నారు.

కాలేజీలకు వెళ్లకుండా డ్రాప్‌ అవుట్‌ అవుతున్న ఆ 77శాతం మందిని చైతన్య పరచడం చాలా కీలకమన్నారు. వీరు చదువులకు పుల్‌స్టాప్‌ పెట్టకుండా కొనసాగించాలని, అందులో భాగంగానే పూర్తిస్థాయి ఫీజు రియింబర్స్‌మెంట్, అమ్మ ఒడి, విద్యావసతి, నాడు–నేడు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.

ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెడుతున్నామన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో రష్యాతో సమానంగా 18–23 యేళ్ల మధ్య జీఈఆర్‌(గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌) రేషియో సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం వివరించారు.
 
సీఎం మాటల్లో, ఆయన ఆలోచనల్లో మాకు పాదయాత్ర ప్రభావం కనిపిస్తోందని ప్రపంచబ్యాంకు బృందం ఈ సందర్భంగా పేర్కొంది. క్షేత్రస్థాయలో చూసిన అంశాలన్నీ ఆయన నిర్ణయాల్లో ప్రస్ఫుటంగా ఉన్నాయంది.  
 
చివరి ఏడాదిలో లెర్న్‌ టు లెర్న్‌:
చివరి ఏడాదిలో లెర్న్‌ టు లెర్న్‌ కార్యక్రమం చేపట్టడానికి ఆలోచన చేస్తున్నట్టుగా సీఎం ప్రపంచబ్యాంకు బృందానికి వివరించారు. విద్యార్థులకు ట్యాబ్‌ ఇస్తామని, దీనికి ఇంటర్నెట్‌ సదుపాయం కూడా కల్పిస్తామని, డిజిటల్‌ క్లాసులతో వాటిని అనుసంధానం చేస్తామన్నారు.

విద్యార్థులు నేర్చుకోవడమే కాకుండా, తమ తల్లిదండ్రులకు వ్యవసాయం సహా ఇతర అంశాల్లో అవసరమైన విజ్ఞానాన్ని పంచడానికి వీటిని వినియోగిస్తారని వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధులకు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమం సమూల మార్పులను తీసుకు రావడానికి ఉపయోగపడుతుందని సీఎం ఆకాక్షించారు.

ముఖ్యమంత్రితో భేటీలో పాల్గొన్న ప్రపంచబ్యాంకు దక్షిణాసియా హ్యూమన్‌ డెవలప్‌ మెంట్‌రీజినల్‌ డైరెక్టర్‌ షెర్‌బర్న్‌ బెంజ్, వరల్డ్‌ బ్యాంకు హెల్త్, న్యూట్రిషన్‌ అండ్‌ పాపులేషన్‌ లీడ్‌ ఎకనమిస్ట్‌  డాక్టర్‌ అజయ్‌ టాండన్, లీడ్‌ ఎడ్యుకేషన్‌ స్పెషలిస్ట్‌ షబ్నం సిన్హా, సీనియర్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌ మోహినీ కక్, సీనియర్‌ స్పెషలిస్ట్‌ కార్తీక్‌ పెంటల్, సీనియర్‌ స్పెషలిస్ట్‌ ప్రవేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలంసాహ్ని,  ముఖ్యమంత్రి కార్యాలయఅధికారులు ప్రవీణ్‌ ప్రకాష్, డాక్టర్‌ పీవీరమేష్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.