1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మే 2022 (09:04 IST)

వైకాపా నేతపై ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వెళితే చితికబాదిన ఎస్ఐ

appolice
తన తల్లికి పింఛన్‌ను నిలిపివేయాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వైకాపా నేతపై పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్ ఎస్.ఐ చితకబాదాడు. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో జరిగింది. బాధితుడిని ఎస్ఐ చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జిల్లా ఎస్పీ స్పందించి ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిలమత్తూరు గ్రామానికి చెందిన పద్మావతమ్మ అనే మహిళ మద్దతురాలని, అందువల్ల ఆమె ఇస్తున్న పింఛన్ తొలగించాలని స్థానిక వైకాపా నేత దామోదర్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన గ్రామ సచివాలయ కార్యదర్శి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించడంతో పింఛన్ ఇస్తున్నారు. 
 
అయితే, తన పింఛనును తొలగించేందుకు దామోదర్ రెడ్డి ప్రయత్నించినట్టు పద్మావతమ్మకు తెలియడంతో తన కుమారుడు వేణును వెంటబెట్టుకుని వైకాపా నేత ఇంటికి వెళ్ళింది. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. అంతటితో ఊరుకోని దామోదర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వేణు తాగి తన ఇంటి ముందు గొడవ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడంతో వారొచ్చి వేణును మందలించి వెళ్లిపోయారు. 
 
ఆ తర్వాతి రోజు వేణు మరికొందరితో కలిసి దామోదర్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. వేణును చూసిన వెంటనే అకారణంగానే ఎస్ఐ రంగడు ఆగ్రహంతో ఊగిపోతూ చెలరేగిపోయాడు. నానా బూతులు తిడుతూ చేయి చేసుకున్నాడు. వేణును చితకబాదాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ విచారణ జరిపేందుకు పెనుకొండ డీఎస్పీ రమ్యను నియమించారు.