బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (22:12 IST)

మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి: జ‌గ‌న్‌

రాష్ట్రంలో మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతపై హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌, సీఎంవో అధికారులతో సీఎం జగన్ క్యాంపు కార్యాల‌యంలో బుధ‌వారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ‘దిశ’ యాప్‌పై పూర్తి అవగాహన కలిగించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి వారి ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళల ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

దీనిలో భాగంగా దిశ యాప్‌పై ముందుగా మహిళా పోలీసులు, వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రమాదకర పరిస్థితుల్లో యాప్‌ వినియోగంపై కళాశాలలు, విద్యా సంస్థల్లోనూ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.

‘దిశ’ స్థానిక పోలీస్‌ స్టేషన్లు సత్వరమే స్పందించేలా సన్నద్ధం కావాలని.. ఇందుకోసం పోలీస్‌ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌ వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలని సీఎం తెలిపారు. సమావేశంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.