శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2019 (17:54 IST)

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవింద‌రాజ‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ త‌రువాత స్నపనతిరుమంజనం వేడుక‌గా జరిగింది.

ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు.

రాత్రి 7.30 నుండి 9.00 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు. రూ.5౦౦ చెల్లించి గృహస్తులు (ఇద్దరికి) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం.

అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయ‌ర్‌ స్వామి, ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో వ‌ర‌ల‌క్ష్మి, ఏఈవో ర‌వికుమార్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ కృష్ణ‌మూర్తి ఇత‌ర అధికారులు, భ‌క్తులు పాల్గొన్నారు.