బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2019 (17:47 IST)

నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి .. మంత్రి వెల్లంపల్లి

కనకదుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలకు అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఈ 25నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

స్థానిక వినాయక గుడి వద్ద నుండి దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు జరుగుతున్న బారికేడింగ్, ఫ్లైఓవర్ వద్ద చేపట్టవలసిన పనులు, పార్కింగ్, కేశఖండన శాల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాదం కౌంటర్ల ఏర్పాటు తదితర అంశాలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జాయింట్ కలెక్టర్ మాధవీలత, డిసిపి విజయరావు, ఇ.ఓ. యం.వి.సురేష్ బాబు సంబంధిత అధికారులతో కలిసి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గత ఏడాది తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించి పటిష్టమైన ఏర్పాట్లు చెయ్యాలని మంత్రి అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఫ్లైఓవర్ వద్ద ఉన్న పరికరాలను వేరొక చోటుకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ & బి ఎస్.ఇ.జాన్మోషేకు సూచించారు. వినాయకుడి గుడి నుండి బారికేడింగ్ చెయ్యాలని, అవసరమైన ఇతర ప్రాంతాలలో కూడా బారికేడింగ్ ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉండాలని ఆర్ & బి అధికారులకు సూచించారు.

రోడ్లపై గుంటలు లేకుండా రోడ్లకు మరమ్మత్తులు చేపట్టి త్వరితగడిన పూర్తి చెయ్యాలని నగరపాలక సంస్థ సి.ఇ. రామమృష్ణకు సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం అనువైన స్థలాలను గుర్తించి భక్తులకు, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఆర్ & బి, నగరపాలక సంస్థ ఎండోమెంట్స్, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలన్నారు.

లడ్డు ప్రసాదాలు అందరికీ అందేవిధంగా అవసరమైనచోట్ల కౌంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మనరాష్ట్ర ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల నుండి లక్షలాదిమంది భక్తులు దర్శనానికి వస్తారని వారందరికి అన్నిరకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.

దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు ఏ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బారికేడ్లలో భక్తులకు నిరంతరం త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని భక్తులకు సేవలందించేందుకు కావలసిన వాలంటీర్లను నియమించుకునేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు.

కేశఖండనశాల, షవర్ బాత్లు ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేస్తున్నామన్నారు. లక్షలాది మంది వచ్చే ఈ ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించి విజయవంతం చేస్తామన్నారు. పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించి లోటుపాట్లు లేకుండా పూర్తిచేసేందుకు మరోదఫా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.

గత ప్రభుత్వం ఫైఓవర్ పనులను నిర్లక్ష్యం చేసిందని, గత కృష్ణా పుష్కరాలనాటికే ఫ్లైఓవర్ ను పూర్తిచేస్తామన్నారని కాని ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులను వేగవంతం చేశామని, డిసెంబర్ 31 నాటికి పూర్తి చెయ్యాలని డెడ్ లైన్ పెట్టి పనులు చేస్తున్నామన్నారు.

దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఫైఓవర్ పనుల వలన ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్గామల్లేశ్వరస్వామి దసరా నవరాత్రి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినందున వచ్చే ఏడాది నుండి మాస్టర్ ప్లాన్ తయారుచేసి పకడ్బందీగా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు.

ప్రభుత్వం నుండి కూడా సహకారం అందిస్తామన్నారు. దసరా ఉత్సవాలు, భవానీ దీక్షల విరమణలకు శాశ్వతంగా ప్రణాళిక తయారుచేస్తామన్నారు. ఎంఎల్ఏ మల్లాది విష్ణు మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి త్వరితగతిన నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలన్నారు. ప్రతి శాఖ అధికారులుల ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆప్రకారం ఏర్పాట్లు చెయ్యాలన్నారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. త్వరితగతిన అమ్మవారి దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చెయ్యాలన్నారు. కేశఖండన శాల ఏర్పాటుపై అధికారులతో చర్చించామన్నారు. గిరి ప్రదక్షిణ చేసేవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చెయ్యాలన్నారు. ఉత్సవాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని విష్ణు పేర్కొన్నారు.

జాయింట్ కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈ నెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. శనివారం ఉ త్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించామని, అక్కడ నిర్ణయించిన ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

కార్యక్రమంలో ఆర్టీఓ చక్రపాణి, ఆర్ & బి ఇఇ సుబ్బయ్య, తాహశీల్దారు సుగుణ, మత్స్యశాఖ, ఎండోమెంట్స్, ఆర్డబ్ల్యూఎస్ ఇ.ఇ., నగరపాలకసంస్థ అధికారులు పాల్గొన్నారు.