సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 28 ఆగస్టు 2021 (16:15 IST)

వెంక‌న్న స‌న్నిధిలో 30న గోకులాష్టమి, 31న ఉట్లోత్సవం

ఆగ‌స్టు 30న శ్రీకృష్ణ జన్మాష్టమి. తిరుమ‌ల తిరుప‌తి వేంకటేశ్వరస్వామి వారిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆ రోజున గోకులాష్టమి ఆస్థానం  నిర్వహించనున్నారు.
 
శ్రీవారి ఆలయంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. సర్వ భూపాల వాహనంపై శ్రీకృష్ణ స్వామి వారిని ఆహ్వానించి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్ర శ్రీనివాస మూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.
 
అదే విధంగా ఆగస్టు 31న తిరుమలలో ఉట్లోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని, సాయంత్రం 4 నుండి 5 గంటల వర‌కు శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఆస్థానం నిర్వ‌హిస్తారు.  
       
ప్ర‌తి ఏడాది తిరుమ‌లలో ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్ప స్వామి వారు, శ్రీకృష్ణస్వామివారు తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ హార‌తులు స్వీక‌రిస్తారు. యువ‌తీ  యువకులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ఉట్లోత్సవంలో పాల్గొంటారు. కానీ, కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవాల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో ఈ ఏడాది ఏకాంతంగా టీటీడీ నిర్వ‌హించనుంది.
 
ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 31న శ్రీవారి ఆలయంలో నిర్వహించే వ‌ర్చువ‌ల్ సేవ‌లైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.