శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (19:07 IST)

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన(Video)

శ్రీలంక అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన తన కుటుంబ సభ్యులు, శ్రీలంక ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తో కలిసి బుధవారం ఉదయం విఐపి బ్రేక్‌లో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ నుండి ఈ ఉదయం 6:10 గంటలకు మహాద్వారం చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేనకు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాస రాజు, శ్రీవారి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీవారి దర్శనానికి వెంట వుండి తీసుకెళ్లారు.
 
ముందుగా, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభానికి మ్రొక్కి అనంతరం బంగారు వాకిలి ద్వారా వెళ్లి  శ్రీవారి గర్భాలయం బయట నిలబడి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, వకుళామాత దర్శనం, విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు తీర్చుకున్నారు. 
 
అలాగే, రంగనాయకుల మండపంలో వేదపండితులు శ్రీలంక ప్రెసిడెంట్ దంపతులకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలను అందించారు. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాస రాజులు శ్రీ పద్మావతి సమేత శ్రీవారి చిత్ర పటాన్ని, ప్రసాదాలను శ్రీలంక ప్రెసిడెంట్ దంపతులకు అందించారు. శ్రీవారి దర్శనం అనంతరం, శ్రీలంక అధ్యక్షుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ పద్మావతి అధితి గృహానికి చేరుకున్నారు. ఈ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.