శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By selvi
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (13:48 IST)

మహా సంప్రోక్షణం.. బోసిపోయిన వెంకన్న ఆలయం.. 18వేల మందే..?

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం బోసిపోయింది. భక్తులు లేకుండా వెలవెలబోయింది. మహా సంప్రోక్షణంలో భాగంగా వెంకన్న ఆలయంలో భక్తుల రద్దీ బాగా తగ్గిపోయింది. నిత్యం భారీ సంఖ్యలో భక్తులతో కిటకిటలాడే శ్రీవారి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం బోసిపోయింది. భక్తులు లేకుండా వెలవెలబోయింది. మహా సంప్రోక్షణంలో భాగంగా వెంకన్న ఆలయంలో భక్తుల రద్దీ బాగా తగ్గిపోయింది. నిత్యం భారీ సంఖ్యలో భక్తులతో కిటకిటలాడే శ్రీవారి ఆలయం ప్రస్తుతం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. అలిపిరి వద్ద వాహనాల అలికిడి కనిపించడం లేదు. సప్తగిరులు భక్తులు లేకుండా కనిపిస్తున్నాయి.
 
మహా సంప్రోక్షణం సందర్భంగా చాలా తక్కువ మందికే దర్శనం ఉంటుందని ముందునుంచి విస్తృతంగా చేపట్టిన ప్రచారం ఫలితాన్నిచ్చింది. శనివారం నాడు అంకురార్పణ రోజు దాదాపు 51 వేల మందికి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నా 33,106 మంది మాత్రమే వచ్చారు. ఆదివారం 29,900 మంది స్వామిని చూసే వీలున్నా, 18 వేల మంది మాత్రమే దర్శనానికి వచ్చారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కేవలం రూ. 73 లక్షలుగా నమోదైంది.
 
2006లో ఇదే మహా సంప్రోక్షణ సమయంలో భక్తులు విరివిగా వచ్చారని, అప్పటితో పోలిస్తే, ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారని, కోట్లల్లో జరిగే వ్యాపారం లక్షల్లోకి పడిపోయిందని తితిదే అధికారులు తెలిపారు. అలాగే పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడినంత నష్టాన్ని ఇప్పుడు మళ్లీ చూస్తున్నామని కొండపై దుకాణదారులు వాపోతున్నారు. ఇక తిరుపతి నుంచి తిరుమలకు భక్తులను చేరవేసేందుకు పనిచేసే ట్యాక్సీ డ్రైవర్లకు పని లేకుండా పోయింది. 
 
మరోవైపు.. తిరుమలలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు వైభవంగా ప్రారంభమైంది. గర్భాలయంలోని స్వామివారి అంశను కలశంలోకి ఆవహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో ఉన్న దేవతామూర్తుల శక్తులను కలశాల్లోకి ఆవహించి, వాటిని యాగశాలకు తరలించారు. ఇక సోమవారం యాగశాలలో కుంభానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.