శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (10:47 IST)

తెలుగు రాష్ట్రాలలో సమ్మె... ఎక్కడికక్కడ స్తంభించిన రవాణా వ్యవస్థ

దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టి సమ్మె తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా నడుస్తోంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. బ్యాంకుల్లో లావాదేవీలు స్తంభించాయి. కార్మిక చట్టాల్లో సవరణలను, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలు బుధవారం దేశవ్యాప్త సమ్మె చేస్తున్నాయి. సార్వత్రిక సమ్మెకు రహదారి రవాణాసంస్థ, రైల్వే, ఆటో, లారీ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని రవాణా వ్యవస్థ స్తంభించింది. ఆర్టీసీ బస్సులు తిరగక పోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ, లారీ, ఆటో సంఘాల కార్మికులు సమ్మెకు మద్దతు తెలిపారు. సమ్మెకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జూట్‌మిల్లులో కార్మికులు విధులకు హాజరు కాలేదు. సార్వత్రిక సమ్మె ప్రభావంతో చిత్తూరు జిల్లాలో సగానికిపైగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆటోలు పూర్తిగా నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు బస్సులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సమ్మె కరాణంగా విజయనగరం జిల్లాలోని ఆర్టీసీ డిపోలు బోసిపోయాయి. విశాఖస్టీల్‌ ప్లాంట్‌, షిప్‌యార్డు, హెచ్‌పీసీఎల్‌, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు సమ్మె బాట పట్టాడు. సార్వత్రిక సమ్మెకారణంగా ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గేటు ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు.
 
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెకు మద్దతు తెలిపారు. హైదరాబాద్‌లో ఆటోలు కూడా నడపక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణిలో 18 గనుల్లో కార్మికులు సమ్మెకు మద్దతుగా విధులు బహిష్కరించారు. దీంతో 45వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయమేర్పడింది. ఇవాళ ఒక్కరోజే సింగరేణికి సంస్థ రూ.9కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.