సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (14:35 IST)

కాషాయ రంగు వేస్తే ఊరుకుంటారా? జగన్ సర్కారుకు సుప్రీం తలంటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా సర్కారు మరోమారు భంగపాటుకు గురైంది. ఇప్పటికే పలుసార్లు రాష్ట్ర హైకోర్టుతో అక్షింతలు వేసుకున్న జగన్ సర్కారు.. ఇపుడు సుప్రీంకోర్టు చేతిలో రెండోసారి తలంటుపోసుకుంది. 
 
మొన్నటికిమొన్న స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ జగన్ సర్కారు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించ, అక్కడ చుక్కెదురైంది. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ గ్రామపంచాయతీ భవనాలకు వైకాపా జెండా గుర్తులను వేసింది. 
 
దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఆ రంగులను తక్షణం తొలగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి బాబ్డే సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 
 
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కాషాయ రంగు వేస్తే మీరు ఊరుకుంటారా? అని ప్రభుత్వాన్ని సూటింగా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ, ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ రంగులను తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది. కార్యాలయాలకు రంగులు వేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.