జగన్ సర్కారుకు సుప్రీంలో షాక్ : ఎస్ఈసీ నిర్ణయంలో వేలుపెట్టం
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరోమారు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీం తాజా తీర్పు జగన్ సర్కారుకు చెంపపెట్టువంటింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించింది. ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఎన్. రమేష్ కుమార్ నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ, ఎన్నికల వాయిదాను కొనసాగించాలని తెలిపింది.
కరోనా విజృంభణ నేపథ్యంలో తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని తెలిపింది. ఈ విషయంలో ఆరు వారాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచన చేసింది.
అలాగే, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ తేదీలను ప్రకటించిన తర్వాత నాలుగు వారాలకు ముందు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. అదేసమయంలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రకటించిన, అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను మాత్రం కొనసాగించుకోవచ్చని, కొత్త వాటిని ప్రకటించడానికి వీల్లేదని, ఓటర్లను ప్రలోభా పెట్టేలా కొత్త పథకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.