కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం చెల్లించాల్సిందే!
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొవిడ్‌తో చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం లేకున్నా పరిహారం అందించాలని ఆదేశించింది. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం అందించాలని పేర్కొంది.
కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన రూ.50 వేల పరిహారాన్ని ఏ రాష్ట్రం కూడా ఇవ్వకుండా నిరాకరించరాదని కోర్టు స్పష్టం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రంలో కరోనాతో చనిపోలేదని పేర్కొనడాన్ని ఇందు కోసం కారణంగా చూపరాదని తెలిపింది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ రూపొందించిన మార్గదర్శకాలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక సూచనలు చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం అప్పటికే జారీ చేస్తే దానిలో మార్పుల కోసం బాధితులు సంబంధిత విభాగం వద్దకు వెళ్లొచ్చని సూచించింది. ఈ పథకానికి సంబంధించి మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.