సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 4 అక్టోబరు 2021 (16:03 IST)

అక్టోబర్ 5న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రేక్ దర్సనాలు లేవు

తిరుమల శ్రీవారికి అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 5వ తేదీ మంగళవారం నాడు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు.
 
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్ధానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
 
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుద్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు.
 
ఆ తరువాత నామకోపు, శ్రీచూర్ణం, కస్పూరి పసుపు, కిచిలీగడ్డ వాటితో సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్సనానికి అనుమతిస్తారు. 
 
శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 5వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమజనం సంధర్బంగా విఐపి బ్రేక్ దర్సనాలు రద్దు చేసింది టిటిడి. అక్టోబర్ 4వ తేదీ బ్రేక్ దర్సనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కాబట్టి విఐపిలు, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.