పద్మావతి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల వేంకటేశ్వరస్వామి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 7.30గంటల నుంచి 9.30గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవను రద్దు చేశారు.
ఈ సంధర్భంగా హైదరాబాద్ కు చెందిన శ్రీ సాయిరాం అనే భక్తులు 12పరదాలు విరాళంగా అందించారు. ఈనెల 18వతేదీ నుంచి 20వతేదీ వరకు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా జరుగనున్నాయి.
కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. సెప్టెంబర్ 18వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబర్ 19వతేదీన పవిత్ర సమర్ఫణ, సెప్టెంబర్ 20వ తేదీన మహాపూర్ణాహుతి చేపడతారు. అయితే ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలంటే వర్చువల్ విధానంలో పాల్గొనాల్సి ఉంటుంది.