శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 13 మే 2021 (19:14 IST)

తిరుమల వెంకన్న సోదరుడి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

చాలామంది భక్తులకు తిరుమల వేంకటేశ్వరస్వామికి సోదరుడు ఉన్నాడా అన్న అనుమానం ఉంటుంది. అయితే స్వామివారికి స్వయానా అన్న తిరుపతిలో వెలిసిన గోవిందరాజస్వామి. తిరుపతికి వచ్చే భక్తులలో చాలామంది గోవిందరాజస్వామిని దర్సించుకుంటారు కానీ ఆయన ప్రాశస్త్యం, ప్రాముఖ్యత తెలియదు. అంతటి ప్రాముఖ్యత కలిగిన గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టిటిడి నిర్వహించింది.
 
తిరుమల వేంకటేశ్వరస్వామి స్వయానా అన్న తిరుపతిలో వెలసిన గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని కోవిడ్-19 ప్రకారం ఏకాంతంగా నిర్వహించారు.
 
ముందుగా తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోడలు, శుద్ధి చేసిన తరువాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ సుగంధ ద్రవ్యాలను కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత భక్తులను దర్సనానికి అనుమతించారు.