ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 మే 2021 (18:49 IST)

మే 25 నుండి 27వ తేదీ వరకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 25 నుండి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. మే 24వ తేదీ అంకురార్పణం నిర్వ‌హిస్తారు. కోవిడ్‌-19 వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా వ‌సంతోత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఈ కార‌ణంగా మే 26న స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వానికి బ‌దులుగా తిరుచ్చి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.
 
ఈ మూడు రోజులపాటు మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలో అమ్మ‌వారిని ఊరేగిస్తారు. ఈ కార‌ణంగా మే 24న కల్యాణోత్సవం, ఊంజలసేవ, మే 25 నుండి 27వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.
 
మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్స‌వాలను పురస్కరించుకొని ఆలయంలో మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది.
 
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 8 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు.

అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా మే 18న ఉద‌యం, సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నం, క‌ల్యాణోత్సవం, ఊంజలసేవను టిటిడి రద్దు చేసింది.