బంగ్లాదేశ్ జలాల్లోకి ఎనిమిది మంది మత్స్యకారులు.. ఏపీకి తీసుకురావడానికి చర్యలు
బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించిన కారణంగా బంగ్లాదేశ్ నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది మత్స్యకారులను తిరిగి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని వ్యవసాయ మంత్రి కె. అచ్చెన్నాయుడు గురువారం తెలిపారు. మత్స్యకారులను విడుదల చేయాలని కోరుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అధికారిక లేఖ పంపినట్లు మంత్రి తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ సంఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మత్స్యకార సమాజానికి, వారి కుటుంబాలకు రక్షణ కవచంగా పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. విశాఖ పట్నంకు చెందిన వి. సత్యనారాయణ యాజమాన్యంలోని IND-AP-V5-MM-735 అనే ఫిషింగ్ బోట్‌ను కూడా బంగ్లాదేశ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నివేదికల ప్రకారం, మత్స్యకారులు అక్టోబర్ 13న వైజాగ్ తీరం నుండి లోతైన సముద్రంలో చేపలు పట్టడానికి బయలుదేరి, అనుకోకుండా బంగ్లాదేశ్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. వారు సురక్షితంగా తిరిగి రావడానికి వీలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.