మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 4 సెప్టెంబరు 2021 (17:55 IST)

అక్టోబర్ మొదటి వారంలోనే శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు: టిటిడి ఈఓ

ప్రతి నెల నిర్వహించే డయల్ యువర్ ఈఓ కార్యక్రమం తిరుపతిలో జరిగింది. టిటిడి పరిపాలనా భవనంలో జరిగిన కార్యక్రమంలో ఈఓ పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ముఖ్యంగా శ్రీవారి దర్సనానికి సంబంధించిన ఉచిత టోకెన్లపైన మరోసారి క్లారిటీ ఇచ్చారు టిటిడి ఈఓ. 
 
అక్టోబర్ మొదటి వారంలోగా శ్రీవారికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని.. టిటిడి ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రణ వేగంగా పూర్తవుతోందన్నారు.
 
ఎక్కడా స్వామి వారి డైరీలు, క్యాలెండర్ల కొరత రాకుండా చూస్తున్నామన్నారు. అలాగే టిటిడి తయారుచేసే అగరబత్తీలను సెప్టెంబర్ 13వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 
 
కోవిడ్ కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు ఉచిత టోకెన్లను మంజూరు చేసే ప్రసక్తే లేదన్నారు. క్రిష్ణాష్టమి పర్వదినం రోజున ప్రారంభమైన నవనీత సేవలో భక్తులకు అవకాశం కల్పిస్తామని.. సెప్టెంబర్ 9వ తేదీన తిరుమలలో వరాహ జయంతిని నిర్వహిస్తామన్నారు.
 
అలాగే ఈ నెల 18,20 తేదీల్లో తిరుచానూరులో వర్చువల్ విధానం ద్వారా పవిత్రోత్సవాలను నిర్వహిస్తామని.. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహిస్తున్నామన్నారు. విమాన గోపురానికి బంగారు తాపడ పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో బాలాలయం నిర్వహిస్తామన్నారు.