శనివారం, 15 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

murder
తిరుమల పరకామణి చోరీ కేసులో ఫిర్యాదు చేసిన తితిదే ఏవీఎస్‌వో సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందినట్టు శుక్రవారమంతా ప్రచారం జరిగింది. అయితే, ఆయనది అనుమానాస్పద మృతి కాదని హక్కా హత్యేనని వైద్యులు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో తేలింది. దీనిపై మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుత్తి జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు. పరకామణిలో డాలర్ల చోరీ కేసు నిందితులే హత్య చేసినట్లు అందులో పేర్కొన్నారు. 
 
తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడిన కేసులో ఫిర్యాదుదారైన అప్పటి అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (ఏవీఎస్‌వో) వై.సతీష్‌ కుమార్‌ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెల్సిందే. ఈ కేసులో తిరుపతిలో సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శవమై తేలారు. 
 
ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సీఐగా ఉన్న సతీష్‌ కుమార్‌ గతంలో తితిదే ఏవీఎస్‌వోగా పనిచేశారు. పరకామణి కేసులో ఈ నెల 6న సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్థరాత్రి గుంతకల్లు నుంచి తిరుపతికి రైలులో బయలుదేరారు. తాడిపత్రి మండలం కోమలి రైల్వేస్టేషన్‌ సమీపంలో పట్టాల పక్కన శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. 
 
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించగా, శరీరం లోపలి భాగంలోని ఎముకలన్నీ విరిగిపోయినట్టు వెల్లడైంది. అలాగే, సతీష్ కుమార్ మెడ భాగంలో గొడ్డలి వేటు గాట్లు ఉన్నట్టు వైద్యులు నిర్దారించారు.