Aditya Haasan, Krishna Chaitanya and others
సినీ సంగీత ప్రపంచంలో ఘంటసాల వేంకటేశ్వరరావు (ఘంటసాల)వారి చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఘంటసాల ది గ్రేట్ అనే మూవీని అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి గారు నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు రచన, దర్శకత్వంలో తెరకెక్కించారు.
ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను ముఖ్య అతిథిగా హాజరైన ఆదిత్య హాసన్ లాంఛ్ చేశారు.
ఆదిత్య హాసన్ మాట్లాడుతూ .. నాకు ఇండస్ట్రీలో అశోక్ అనే మిత్రుడు ద్వారా బాలాజీ గారు, రామారావు గారి వద్ద పని చేసే అవకాశం వచ్చింది. కేవలం పన్నెండు రోజులు మాత్రమే రామారావు గారి వద్ద పని చేశాను. నా ఫస్ట్ రెమ్యూనరేషన్ కూడా రామారావు గారే ఇచ్చారు. ఆ తరువాత ఫారిన్ వెళ్లాను. మళ్లీ గ్యాప్ తీసుకుని వచ్చి సొంతంగా దర్శకుడిగా ఎదిగాను. ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ మూవీని ప్రతీ ఒక్కరూ చూడండి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 12న రానున్న ఈ సినిమాను అందరూ చూసి ఆదరించండి అని అన్నారు.
హీరో కృష్ణ చైతన్య మాట్లాడుతూ .. ఘంటసాల ది గ్రేట్ చిత్రంలో ఘంటసాల గారి పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన పాటలు వింటూ పెరిగిన నేను ఈ రోజు ఇలా ఆయన జీవిత చరిత్రను చెప్పే క్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఆయన ప్రయాణాన్ని ఈ చిత్రంలో ఆడియెన్స్ చూస్తారు. నాకు అవకాశం ఇచ్చిన రామారావు గారికి థాంక్స్. ఇప్పటికే చాలా మంది ఈ మూవీని చూశారు. చూసిన వారంతా కూడా భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు సినీ సంగీతంలో మొదటిగా చెప్పుకునే పేరు ఘంటసాల. ఘంటసాల గారు, బాలు గారు రెండు కళ్లలాంటి వారు. వారి ఆశీర్వాదంతో డిసెంబర్ 12న ఈ చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.
దర్శకుడు రామారావు మాట్లాడుతూ .. నా శిష్యుడు ఆదిత్య హాసన్ నా చిత్ర కార్యక్రమానికి వచ్చి టీజర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. పాట అని అనగానే అందరికీ ఘంటసాల గుర్తుకు వస్తారు. సింగర్‌గా కంటే ఆయన వ్యక్తిత్వం గురించి అందరికీ తెలియాలని ఈ సినిమాను తీశాను. ఘంటసాల వారి పాత్రను పోషించమని చాలా మంది స్టార్లను అడిగాను. స్వరాభిషేకంలో కృష్ణ చైతన్య గారిని చూసిన తరువాత ఘంటసాల వారిలా కనిపించారు. ఈ మూవీ ప్రివ్యూ చూసిన ప్రతీ ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. డిసెంబర్ 12న ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీ బయటకు రాకుండా చేయాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలం కావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. ఎన్ని శక్తులు అడ్డు పడినా కూడా డిసెంబర్ 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తాను అని అన్నారు.
రామసత్య నారాయణరాజు మాట్లాడుతూ .. బయోపిక్ తీయాలంటేనే చాలా ధైర్యం కావాలి. రామారావు గారు ఎంతో ధైర్యంతో ఘంటసాల ది గ్రేట్ మూవీని తీస్తున్నారు. ఈ చిత్రాన్ని చూశాను. ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. ఈ తరం వారికి ఘంటసాల గారి గొప్పదనం తెలియకపోవచ్చు. అందరికీ ఘంటసాల గారి గొప్పదనం తెలిసేలా ఈ మూవీని తెరకెక్కించారు. చదలవాడ శ్రీనివాసరావు గారు ఈ మూవీని చూసి మెచ్చుకున్నారు. మహానటిలా ఘంటసాల గొప్ప సినిమా అవుతుందని అభినందించారు. డిసెంబర్ 12న ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమా ప్రేక్షకుల హృదయానికి హత్తుకునేలా ఉంటుంది అని అన్నారు.
శోభా రాణి మాట్లాడుతూ .. ఘంటసాల గారి గురించి చెప్పే స్థాయి నాకు లేదు. ఘంటసాల గారు సింగర్‌గా అందరికీ తెలుసు. కానీ ఆయన ఓ స్వాతంత్ర్య సమరయోధులు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్లారు. అలాంటి ఆయన జీవిత చరిత్రను తెరపైకి రామారావు గారు తీసుకు వస్తుండటం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టం. ఘంటసాల గారు మహోన్నత వ్యక్తి. ఆయనకు అన్ని అవార్డులు దక్కాలి. ఈ చిత్రానికి ప్రభుత్వాలు కచ్చితంగా సాయమందించాలి. కృష్ణ చైతన్య గారి గొంతు కూడా ఘంటసాల వారి గాత్రానికి దగ్గరగా ఉంది. డిసెంబర్ 12న ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాను అందరూ చూడండి అని అన్నారు.
కర్రి బాలాజీ మాట్లాడుతూ .. కష్టపడితే విజయం వస్తుందని ఘంటసాల గారు నిరూపించారు. ఆదిత్య హాసన్ కూడా దాన్ని నిరూపించారు. దర్శకుడిగా, నిర్మాతగా ఆదిత్య హాసన్ ఎంతో గొప్ప స్థాయికి వెళ్లారు. రామారావు గారు కూడా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఇందులోని పాత్రలన్నీ కూడా ఎంతో సహజంగా ఉంటాయి. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. డిసెంబర్ 12న ఈ మూవీని అందరూ చూడండి అని అన్నారు.
నటీనటులు : సుమన్, కృష్ణ చైతన్య, మృదుల , తులసి మూవీ ఫేమ్ అతులిత, సుబ్బరాయు శర్మ, జే.కె. భారవి, సుమన్ శెట్టి, అనంత్, సాయి కిరణ్, అశోక్ కుమార్, గుండు సుదర్శన్, జయవాణీ తదితరులు