ఆదివారం, 16 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 15 నవంబరు 2025 (18:07 IST)

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

Maithili Thakur
కర్టెసి-ట్విట్టర్
మైథిలి ఠాకూర్ కేవలం 25 సంవత్సరాల వయసులో అలీనగర్ నియోజకవర్గంలో ఆర్జేడీ పార్టీకి చెందిన బినోద్ మిశ్రాపై గెలిచి బీహార్‌లో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే అయ్యారు. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మైథిలి ఠాకూర్ అలీనగర్ అసెంబ్లీ స్థానాన్ని 11,730 ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. ఠాకూర్ తన రాజకీయ అరంగేట్రంతో 84,915 ఓట్లను సాధించి, 73,185 ఓట్లు సాధించిన ఆర్జేడీ పార్టీ సీనియర్ నాయకుడైన 63 ఏళ్ల బినోద్ మిశ్రాను ఓడించారు.
 
అయితే ఆమె కీర్తికిరీటాలు రాజకీయ ప్రస్థానం కంటే ముందే ప్రారంభమయ్యాయి. సంగీత కుటుంబంలో జన్మించిన మైథిలి, తన తాత- తండ్రి వద్ద జానపద సంగీతం, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, అలాగే హార్మోనియం, తబలాలో శిక్షణ పొందింది. ఆమె అసాధారణ ప్రతిభను ప్రారంభంలోనే గుర్తించిన ఆమె తండ్రి కుటుంబాన్ని ఢిల్లీలోని ద్వారకకు తరలించారు. అక్కడ మైథిలి 10 సంవత్సరాల వయసులో జాగ్రన్స్, వివిధ సంగీత కార్యక్రమాలలో ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించింది. ఆమె ఢిల్లీలోని బాల్ భారతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంది. భారతి కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ చేసింది.
 
11 సంవత్సరాల వయసులో సరేగమాపా లిటిల్ చాంప్స్‌లో కనిపించింది. 15 ఏళ్ల వయసులో ఆమె సోనీ టీవీలో ఇండియన్ ఐడల్ జూనియర్‌లో పోటీ పడింది కానీ ప్రారంభ రౌండ్లలోనే ఓట్ చేయబడింది. ఒక సంవత్సరం తరువాత, 16 సంవత్సరాల వయసులో, ఆమె ఐ జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్ పోటీని గెలుచుకుంది. తరువాత ఆమె రైజింగ్ స్టార్‌లో పాల్గొని, కేవలం రెండు ఓట్ల తేడాతో రన్నరప్‌గా నిలిచింది.
 
తమ పిల్లల సంగీత సాధన కోసం 17 సార్లు ఇల్లు మారాల్సి వచ్చిందని ఆమె తల్లి చెబుతోంది. 2020లో అపార్ట్‌మెంట్‌లోకి మారాక దానికి సౌండ్‌ప్రూఫ్ లభించింది. సోషల్ మీడియాలో ఆమెకి ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. మైథిలి ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో మ్యూజిక్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెకు లక్షల సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఆమెకు యూట్యూబ్‌లో 5 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్ల మంది ఫాలోవర్లు, ఫేస్‌బుక్‌లో 14 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నారు.