న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)
తనపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు పరారీలో వున్నారనీ, వారిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ డీఐజికి ఫిర్యాదు చేసేందుకు అత్యాచార బాధితురాలు ప్రయత్నం చేసింది. ఐతే ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహార్లో ఓ యువతిపై కొందరు కామాంధులు అత్యాచారం చేసారు. వారిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ అయితే తీసుకున్నారు కానీ నిందితులను పోలీసులు ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదు. దీనిపై ఆమె ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీనితో ఆమె ఈ విషయాన్ని డిఐజి దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లింది.
అక్కడ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. డిఐజిని కలిసేందుకు అనుమతించలేదు. ఐతే ఆమె పోలీసుల నుంచి తప్పించుకుని పరుగులు తీస్తూ డిఐజి వద్దకు వెళ్లి తనకు న్యాయం చేయాలనీ, తనపై అఘాయిత్యం చేసినవారిని అరెస్ట్ చేయాలంటూ అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను విన్న డిఐజి నిందితులను ఎలాగైనా పట్టుకుని శిక్షిస్తామని ఆమెకి భరోసా ఇచ్చారు. ఐతే బాధితురాలని పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.