1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. uttar pradesh dalit man assaulted caste discrimination case filed after delay

యూపీలో దారుణం : దళితుడిపై అగ్రవర్ణాల దాష్టీకం.. బూట్లు నాకించి.. చేయి విరగ్గొట్టారు

crime scene
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో శాంతిభద్రలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే యూపీలో అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఓ దళిత యువకుడిపై రెచ్చిపోయారు. హమీర్‌పూర్ జిల్లాలో ఈ అమానవీయ ఘటన జరిగింది. ఒక దళిత యువకుడుని అగ్ర కులానికి చెందిన కొందరు చితకబాది చేయి విరగ్గొట్టారు. అంతటితో శాంతించని వారు అతనితో బూట్లు నాకించారు. అయితే, ఘటన జరిగి 12 రోజులైనా స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. చివరికి జిల్లా ఎస్పీ జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదైంది.
 
సిమ్నౌడి గ్రామానికి చెందిన దళిత యువకుడు ఉమేష్ బాబు వర్మ అక్టోబరు 5వ తేదీన మార్కెట్‌కు ఈ ఘటన జరిగింది. మార్గమధ్యలో అభయ్ సింగ్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి ఉమేష్‌ను అడ్డగించాడు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను చించివేయడంపై ఉన్న పాత గొడవను మనసులో పెట్టుకుని వారు కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు.
 
'నన్ను కులం పేరుతో తిడుతూ, వాళ్ల బూట్లు నాకమని బలవంతం చేశారు. ఆ తర్వాత నాపై దాడి చేసి చేయి విరగ్గొట్టారు' అని బాధితుడు ఉమేష్ స్థానిక మీడియాకు తన ఆవేదనను వివరించాడు. దాడి తర్వాత న్యాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోలేదని వాపోయాడు. 'చాలాసార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను, కానీ నా ఫిర్యాదును ఎవరూ స్వీకరించలేదు' అని తెలిపాడు.
 
స్థానిక పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఉమేష్ నేరుగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) డాక్టర్ దీక్షా శర్మను కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించాడు. ఆమె ఆదేశాలతో పోలీసులు 12 రోజుల ఆలస్యంగా అభయ్ సింగ్, మరో ఇద్దరిపై దాడి, దళితులపై అకృత్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, ఫిర్యాదును నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఇలాంటి దారుణాలు జరగడంపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఢిల్లీ ప్రజలకు ఊపిరాడటం లేదు.. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం