ఆదివారం, 16 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 15 నవంబరు 2025 (19:17 IST)

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

Asif Munir
తప్పు చేసినవాడు తప్పకుండా శిక్షించబడతాడు. న్యాయం, ధర్మం పాటించనివాడికి తగిన శిక్ష ఖచ్చితంగా వుంటుంది కదా. అన్ని అధికారాలు తనవేనంటూ విర్రవీగిన హిట్లర్ వంటి నియంతలు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. తానే దైవాంశ సంభూతుడినంటూ తల ఎగరేసిన ఎందరినో కాల ప్రవాహంలో కొట్టుకునిపోయారు. కానీ ఇలాంటివి చూసినా పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోలేదు. ఆ దేశ సైన్యాధిపతికి మరిన్ని అధికారాలు కట్టబెట్టడమే కాదు... జీవితాంతం అతడు ఎలాంటి తప్పు చేసినా కూడా అరెస్ట్ చేయకుండా చట్టాన్ని ఆమోదించింది.
 
అంతేకాదు.. అతడిని ప్రాసిక్యూషన్ కూడా చేయకూడదట. కోర్టులు సైతం అతడు అధర్మం చేస్తే బోనులో నిలబెట్టే అధికారం కూడా లేదని చట్టసభల్లో చట్టాన్ని తెచ్చి ఆమోదించారు. దానికి పాకిస్తాన్ రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేసేసారు. ఇలా సైన్యాధిపతికి సర్వాధికారాలతో పాటు అరెస్ట్ కూడా చేయకుండా చట్టాన్ని తీసుకురావడంపై అక్కడి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీవ్రంగా తప్పుబట్టారు.
 
ఇద్దరు న్యాయమూర్తులు తమ పదవులకు రాజీనామా చేసారు. జీవితకాలం అరెస్ట్ చేయకుండా ఒక వ్యక్తికి అలా రక్షించడం అనేది న్యాయానికి గొడ్డలిపెట్టు అని వారు వ్యాఖ్యానించారు. ఈ చట్టం తేవడంతో ఇక పాక్ సైన్యం వికృత చేష్టలు జడలు విప్పుకుంటుందన్న ఆందోళనల్లో ఆ దేశ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మరి పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఆ దేశాన్ని ఏ దిశలోకి తీసుకువెళ్తుందో కాలమే నిర్ణయిస్తుంది.