సోమవారం, 10 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

భారత్ పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది డోనాల్డ్ ట్రంపే : పాక్ ప్రధాని

indopak border
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని ఆపింది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపేనని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం కూడా జరిగింది. ఆ సమయంలో భారత్ జరిగిన భీకర సైనికదాడికి పాకిస్థాన్ బెంబేలెత్తిపోయింది. అయితే, అమెరికా జోక్యంతో ఈ యుద్ధం సద్దుమణిగిపోయిందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా సమర్థించారు. తాజాగా మరోమారు ఈ యుద్ధంపై ఆయన వ్యాఖ్యలు చేశారు. 
 
భారత్, పాకిస్థాన్ మధ్య గత మే నెలలో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చి, యుద్ధాన్ని నివారించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపేనని షెహబాజ్ షరీఫ్ మరోసారి ప్రశంసించారు. ఆయన 'ధైర్యవంతమైన, నిర్ణయాత్మక నాయకత్వం' వల్లే కాల్పుల విరమణ సాధ్యమైందని కొనియాడారు. శనివారం అజర్ బైజాన్ రాజధాని బాకులో జరిగిన 'విక్టరీ డే' పరేడ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
తన ప్రసంగంలో షెహబాజ్ మాట్లాడుతూ 'ట్రంప్ జోక్యంతో దక్షిణాసియాలో శాంతి పునరుద్ధరించబడింది. ఒక పెద్ద యుద్ధం నివారించబడింది, తద్వారా లక్షలాది మంది ప్రాణాలు నిలిచాయి' అని పేర్కొన్నారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల అనంతరం మే 10న ఇరు దేశాలు 'పూర్తి, తక్షణ కాల్పుల విరమణ'కు అంగీకరించినట్లు ట్రంప్ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
అప్పటి నుంచి పాకిస్థాన్ ఈ ఘనతను ట్రంప్‌నకు ఆపాదిస్తుండగా, భారత్ మాత్రం ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో ఏ మూడో వ్యక్తి ప్రమేయం లేదని, నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగిన అనంతరం ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఒక అవగాహనకు వచ్చాయని న్యూఢిల్లీ మొదటి నుంచి స్పష్టం చేస్తోంది.