కమలా హారిస్: 2028 అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.. నా మనవరాళ్లు..?
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ శనివారం జరిగిన ఒక బ్రిటిష్ టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేయవచ్చని అన్నారు. 2024 డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్ స్థానంలో నిలిచి, డోనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయిన హారిస్, మరో వైట్ హౌస్ బిడ్ వేయాలా వద్దా అని ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.
భవిష్యత్తులో అమెరికా అధ్యక్షురాలిగా ఒక మహిళ వైట్‌హౌస్‌లో ఉండడం ఖాయమని, బహుశా అది నేనే కావచ్చు.. అని వ్యాఖ్యానించారు. తన మనవరాళ్లు వారి జీవితంలో ఖచ్చితంగా ఓ మహిళా అధ్యక్షురాలిని చూస్తారని కమలా హారిస్ వెల్లడించారు.
ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమలా హారిస్ మాట్లాడుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ట్రంప్ ఫాసిస్ట్ ధోరణితో వ్యవహరిస్తారని హెచ్చరించానని, ఇప్పుడు అది నిరూపితమైందని ఆమె అన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కానీ రాజకీయాల్లో భవిష్యత్తు ఉందని ఇప్పటికీ నమ్ముతున్నానని హారిస్ పేర్కొన్నారు. తాను చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదన్నారు. తన కెరీర్ మొత్తాన్ని సేవలో గడిపానని, అది తన రక్తంలోనే ఉందని ఆమె అన్నారు.