మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానం ఉంది.. కేటీఆర్ వచ్చి వెళ్ళాకే చనిపోయినట్టు ప్రకటించారు : తల్లి మహానంద
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి అనుమానం వ్యక్తం చేశారు. గోపీనాథ్ మృతి ఒక మిస్టరీగా అనిపిస్తుందన్నారు. ఆయన చనిపోయిన తేదీపై ఓ క్లారిటీ లేదన్నారు. జూన్ 6న చనిపోయారా లేక 8వ తేదీన చనిపోయారా అన్నది సందేహంగా ఉందని ఆమె అన్నారు.
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మాగంటి మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్‌తో కలిసి మహానంద కుమారి మీడియాతో మాట్లాడారు. 'కేటీఆర్ వచ్చిన తర్వాత మరణవార్తను బయటకు చెప్పారు. గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే.. ఒక్క రోజు కూడా చూడటానికి సమయం ఇవ్వలేదు. ఒక్క అటెండర్‌ను కూడా పెట్టలేదు. గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారు.
లీగల్ హెయిర్ సర్టిఫికెట్‌లో మొదటి భార్య, బిడ్డలు, నా పేరు కూడా లేదు. మొదటి భార్యతో విడాకులు కూడా తీసుకోలేదు. నేను గోపీనాథ్‌తో సునీత పెళ్లి చేయలేదు. ఫ్యామిలీ సర్టిఫికెట్‌లో మా పేరు లేదు. కేటీఆర్ వెంట పరుగెత్తి నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలి అనుకుంటే ఆయన కూడా వినలేదు. ఇది డబ్బు సమస్య కాదు. మాకు గుర్తింపు లేదు. అందుకే మీడియా ముందుకొచ్చాం. తల్లిగా ఎంతో బాధపడుతున్నా. సునీతకు టికెట్ ఇచ్చేటప్పుడు కేటీఆర్ మాకు కనీసం సమాచారం ఇవ్వలేదు.
గోపీనాథ్ మొదటి భార్య, కుమారుడికి గుర్తింపు ఉండాలి కదా. మాలిని ఎంతో బాధపడుతోంది. ఎన్నో అవమానాలు పడింది. వద్దు అనుకుంటే మొదటి భార్యతో ఎప్పుడో విడాకులు తీసుకునేవాడు. అలా జరగలేదు అంటే.. సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లే కదా. నలుగురిలో నిరూపించుకోవాలనే బయటకు వచ్చాం. నా పెద్ద కొడుకు కూడా టికెట్ కోసం ప్రయత్నించాడు. గోపీనాథ్ తల్లిగా నాకు అడగాల్సిన హక్కులేదా? లీగల్ హెయిర్ సర్టిఫికెట్‌లో మా పేర్లు లేవని ఆగస్టు 11 నుంచి తహసీల్దార్ కార్యాయానికి వెళ్లి వస్తున్నాం. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదుట' అని అన్నారు.