శనివారం, 15 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 15 నవంబరు 2025 (11:17 IST)

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

mk stalin
ఇటీవలి కాలంలో భారత ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణల కారణంగా ఆ సంఘం ప్రతిష్ట దిగజారిపోతోందని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అద్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆరోపించారు. పైగా, తాజాగా వెలువడిన బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరికీ ఓ పాఠంలాంటివన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఈ ఫలితాలపై ఇండియా కూటమి నేతలు ఎంతో నేర్చుకోవాలన్నారు. 
 
బీహార్‌ ఎన్నికల ఫలితాలు అందరికీ పాఠమన్నారు. నిర్ణయాత్మక విజయం సాధించిన సీఎం నీతీశ్‌కుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో విజయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌కు కూడా శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమాలు, సామాజిక, సైద్ధాంతిక సంకీర్ణాలు, స్థిరమైన ప్రచారంపై ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నారు. ఇండియా కూటమిలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఉన్నారన్నారు. భవిష్యత్తులో వచ్చే కొత్త రాజకీయ సవాళ్లను పరిష్కరించేందుకు వ్యూహాత్మక ప్రణాళిక వేయగలరన్నారు.
 
అలాగే, ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఈ ఫలితంలో ఈసీపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేమని వ్యాఖ్యానించారు. ఈసీ ప్రతిష్ట దిగజారిపోయిందని గుర్తుచేశారు. ఓడిపోయిన అభ్యర్థుల్లో కూడా విశ్వాసాన్ని ప్రేరేపించేలా ఎన్నికల సంఘం ఉండాలన్నారు.