రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్
దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ప్రశంసలు తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'విలాయత్ బుద్ధా'. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఇందులో పృథ్వీరాజ్ తనపై వచ్చే విమర్శల గురించి మాట్లాడారు. ఇటీవల తనను రాజమౌళి ప్రశంసించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని అన్నారు.
'నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ప్రేక్షకులే కారణం. వాళ్ల ప్రేమాభిమానాలే నన్ను ఇక్కడ నిల్చోబెట్టాయి. అలాంటప్పుడు వాళ్లకు విమర్శించే హక్కు కూడా ఉంటుంది. నాపై అభిమానంతోనే ఈ ట్రైలర్ లాంఛ్‌కు ఇంతమంది వచ్చారు. నేను సరిగ్గా నటించకపోతే ప్రతిఒక్కరూ విమర్శించవచ్చు. మలయాళ ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. నా సినిమాల్లో తప్పులు చూపినప్పుడు నన్ను విమర్శించినప్పుడు కూడా నేను వాటిని గౌరవంతో స్వీకరిస్తాను. ఆడియన్స్‌ను అలరించడానికి వందశాతం ప్రయత్నిస్తాను' అని చెప్పారు.
ఇక రాజమౌళి - మహేశ్ బాబు కాంబోలో రానున్న సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు నేడు (నవంబర్ 15) అధికారికంగా వెల్లడిస్తారని పృథ్వీ తెలిపారు. సమయం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడతానని చెప్పారు.