Tea Biscuit: టీతో పాటు బిస్కెట్ టేస్టుగా లేదని.. టీ షాపు ఓనర్‌ని చంపేశాడు
చిన్న చిన్న కారణాలకే హత్యలు చేసే వారు పెరిగిపోతున్నారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా బిస్కెట్ రుచిగా లేదని ఓ టీ షాపు ఓనర్‌ని ఓ కస్టమర్ హత్య చేశాడు. ఈ సంఘటన నవంబర్ 4న పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని రైనాలోని ఖలేర్‌పూల్ ప్రాంతంలో జరిగింది.
కస్టమర్ చేసిన దాడికి టీ దుకాణం యజమాని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో బుధవారం పోలీసులు హుస్సేన్ మొల్లాను అరెస్టు చేశారు. మృతుడిని వృత్తిరీత్యా టీ అమ్మేవాడు, రైనాలోని మచ్ఖండ గ్రామానికి చెందిన ఫరీద్ అలీ షేక్ (50) గా గుర్తించారు. అతని టీ దుకాణం ఖలేర్‌పూల్ ప్రాంతంలో ఉంది.
మంగళవారం, దుకాణానికి తరచుగా వచ్చే మేస్త్రి అయిన హుస్సేన్ మొల్లా టీ కోసం వచ్చినప్పుడు.. టీకి తోడు బిస్కెట్ అడిగాడు. ఆ బిస్కెట్ రుచిగా లేదని మొల్లా ఫిర్యాదు చేసి దుకాణదారుడితో వాదించడం ప్రారంభించాడు. కొద్దిసేపు వాగ్వాదం కొనసాగిన తర్వాత ఇతర కస్టమర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేశారు.
తరువాత, మొల్లా వెదురు కర్రతో దుకాణానికి తిరిగి వచ్చాడని, షేక్ తేరుకునే లోపే మొల్లా అతనిపై దారుణంగా దాడి చేయడం ప్రారంభించాడని తెలుస్తోంది. స్థానికులు షేక్‌ను బుర్ద్వాన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ నుండి నవాభట్ సమీపంలోని మరొక ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఫలించక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఫరీద్ కుమారుడు షేక్ సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ.. దాదాపు ప్రతి ఉదయం, హుస్సేన్ మొల్లా నా తండ్రి దుకాణంలో టీ తాగేవాడు కానీ ఎప్పుడూ డబ్బు చెల్లించేవాడు కాదు. అతనికి ఎప్పుడూ ఏదో ఒక సాకు ఉంటుంది. మంగళవారం ఉదయం కూడా అతను డబ్బు చెల్లించకుండానే వెళ్లిపోయాడు.
తరువాత, అతను బిస్కెట్ గురించి వాదించి డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. స్థానికులు సమస్యను పరిష్కరించినప్పటికీ, అతను వెదురు కర్రతో తిరిగి వచ్చి నా తండ్రి తలపై కొట్టాడు.. అని తెలిపాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మొల్లాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.