శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2015 (09:39 IST)

డబ్బుకు కక్కుర్తిపడి విద్యార్థినులతో వ్యభిచారం చేయించిన మహిళా ప్రొఫెసర్.. ఆపై జైలు

విద్యాబుద్ధులు నేర్పాల్సిన మహిళా ప్రొఫెసర్.. డబ్బుకు కక్కుర్తిపడి తన వద్ద చదువుకునే విద్యార్థినులకు మాయమాటలు చెప్పి వ్యభిచార రొంపిలోకి దించింది. ఆ తర్వాత జైలుపాలైంది. విద్యార్థినులతో వ్యభిచారం చేయించిన కేసులో ఎస్వీయు మహిళా ప్రొఫెసర్ వసంత కుమారితో పాటు.. ఆమెకు సహకరించిన మధ్యవర్తి శ్రీకాంత్‌కు ఏడేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తిరుపతి ఐదో అదనపు జిల్లా కోర్టు తీర్పునిచ్చిన విషయంతెల్సిందే. ఈ కేసులో వసంత కుమారి ఏ విధంగా ఈ వలలో చిక్కుకున్నారనే విషయాన్ని పరిశీలిస్తే... 
 
ఎస్వీయులో ప్రొఫెసర్‌గా పని చేసే వసంత కుమారి పదేళ్ళ క్రితం తిరుపతి పట్టణంలోని బాలాజీ కాలనీలో నివాసముండేది. అప్పట్లోనే కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తూ వచ్చింది. ఇందుకోసం అవసరమైన అమ్మాయిలను తన వద్ద చదువుకునే విద్యార్థినులనే ఎంచుకుంది. అయితే, వృత్తిలో పోటీ రీత్యా వసంతకుమారి ప్రత్యర్థి అయిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పి చంద్రకళ కక్షగట్టి ప్రొఫెసర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వసంతకుమారి కదలికలపై తిరుపతి పోలీసులు నిఘా పెట్టారు. ఈ నిఘాలో.. కొంతమంది విద్యార్థినులను తన ఇంటికే తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్టు పసిగట్టారు. 
 
ఈ పరిస్థితుల్లో ఓ రోజున వసంతకుమారి ఇంటిపై అకస్మాత్తుగా దాడిచేసిన పోలీసులు... వసంతకుమారి, ఆమెకు సహకరించిన శ్రీకాంత్‌తో సహా మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఎస్వీయు అధికారులు ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత 2007లో ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు. ఈ కేసుపై తిరుపతి వెస్ట్ పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలను సేకరించగా, కేసు విచారణ మూడో అదనపు జిల్లా కోర్టులో జరిగింది. కేసును విచారించిన న్యాయమూర్తి వసంతకుమారికి, శ్రీకాంత్‌కు ఏడేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 
 
తీర్పు తర్వాత జైలుకెళ్లిన వసంతకుమారి హైకోర్టు నుంచి బెయిల్ పొంది బయటకు వచ్చారు. పిమ్మట కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఐదో అదనపు జిల్లా కోర్టులో అప్పీల్ చేశారు. ఇక్కడ ఎనిమిదేళ్ళపాటు కేసు విచారణ జరిగింది. ఈ కేసులోని సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శ్యామసుందర్.. కింది కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారుచేస్తూ సోమవారం తీర్పునిచ్చారు. దీంతో వసంతకుమారి, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని తిరుపతి సబ్ జైలుకు తరలించారు.