1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (19:48 IST)

ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి తరలింపు నిర్ణయం పిచ్చి ఆలోచన : జీవన్ రెడ్డి - నాగం

ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిని ఎందుకు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసనసభాపక్ష ఉప నేత టి జీవన్ రెడ్డి, బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే అంశంపై జీవన్ రెడ్డి బుధవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఛాతీ ఆసుపత్రిని అక్కడి నుంచి తరలించడం దేనికి సంకేతమని నిలదీశారు. అవినీతిని సహించబోమని గొప్పలు చెప్పుకునే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కంటికి ఇసుక మాఫియా కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారికంగా ఇసుకను వినియోగించుకునే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా? అని ఆయన నిలదీశారు.
 
అలాగే, బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కూడా ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శల వర్షం గుప్పించారు. తెలంగాణ సచివాలయం, ఛాతి ఆస్పత్రి తరలింపు వ్యవహారం పిచ్చి ఆలోచన అని వ్యాఖ్యానించారు. సచివాలయాన్ని తరలించి ఆకాశ హర్మ్యాలు కడితే పెట్టుబడులు వస్తాయని కేసీఆర్ భ్రమపడుతున్నారని నాగం విమర్శించారు. 
 
ఛాతి ఆస్పత్రి తరలింపుపై అఖిలపక్ష భేటీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆలోచనలు తుగ్లక్ పాలనను తలపిస్తున్నాయని నాగం ఎద్దేవా చేశారు. ఆయన నిర్ణయాల వల్ల మంత్రులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా పోయిందన్నారు. అధికారుల బదిలీలు సీఎం కనుసన్నల్లో జరుగుతున్నాయని నాగం విమర్శించారు.