శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 4 మే 2015 (13:37 IST)

టీడీపీలో లోకేశ్ భజన.. మింగలేక.. కక్కలేక కార్యక్తరల ఇబ్బందులు!

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏం చేయాలన్నా చంద్రబాబు తొలుత నాకేంటి? అని ఆలోచిస్తారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ కుటుంబంలోని అందరినీ పక్కనబెట్టి తన కొడుకును ప్రమోట్ చేసుకోవడం స్వార్థం కాదా? అని ప్రశ్నించారు. టీడీపీలో లోకేశ్ ను భరించలేక కార్యకర్తలు మింగలేక కక్కలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 
 
తెలంగాణలో టీడీపీ కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని అభిప్రాయపడ్డారు. తాను ఎర్రబెల్లి దయాకరరావులా బ్రోకర్‌ను కానని, బ్లాక్ మెయిల్ చేయడానికి తనకు, చంద్రబాబుకు మధ్య వ్యాపార లావాదేవీలు ఏవీ లేవని అన్నారు. పార్టీలో చంద్రబాబు ఎవరినీ ఎదగనివ్వడని తలల దుయ్యబట్టారు. చంద్రబాబులా తాను స్వార్థపరుడిని కానని స్పష్టం చేశారు.

చంద్రబాబు తన నీడను చూసుకుని కూడా భయపడతారని ఎద్దేవా చేశారు. తన కుమారుడి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అందరినీ పక్కనబెట్టి కొడుకును పైకి తీసుకురావాలన్న దురద ఆయనకు లేదని అన్నారు. ఎన్టీఆర్ తన తండ్రి అయివుంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. 
 
ఇక, పార్టీ తనను చేజేతులా దూరం చేసుకుందని విమర్శించారు. ఫుట్ పాత్ నుంచి తీసుకువచ్చి తనకేమీ అవకాశాలివ్వలేదని, ఎన్టీఆర్ తనకు రాజకీయంగా అవకాశమిచ్చారని తెలిపారు. పార్టీలో తప్పులు జరిగితే నిలదీసే అలవాటు మొదటినుంచీ ఉందని వివరించారు.