శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (14:16 IST)

ఫ్లైట్ బోర్డింగ్ కౌంటర్ సిబ్బందిపై జేసీ దివాకర్ వీరంగం.. ప్రయాణాలపై నిషేధం తప్పదా?

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ బోర్డింగ్ కౌంటర్ సిబ్బందిపై తన ప్రతాపం చూపించారు. చివరి నిమిషంలో వచ్చిన తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలంటూ ఒత్తి

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ బోర్డింగ్ కౌంటర్ సిబ్బందిపై తన ప్రతాపం చూపించారు. చివరి నిమిషంలో వచ్చిన తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలంటూ ఒత్తిడి చేశారు. అయితే, సమయం మించిపోయిందని చెప్పిన సిబ్బంది కౌంటర్ మూసివేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జేసీ... కౌంటర్‌లోని టిక్కెట్ ప్రింటింగ్ యంత్రాన్ని పగులగొట్టారు. ఈ సంఘటన గురువారం ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. బోర్డింగ్‌ పాస్‌ జారీ సమయం ముగియడంతో సిబ్బంది కౌంటర్‌ను ముసేశారు. తనకు బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వాలని సిబ్బందితో ఆయన వాదనకు దిగారు. సమయం ముగిసిందని ఇవ్వడం కుదరదని చెప్పడంతో దివాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. బోర్డింగ్‌ పాస్‌ ప్రింటర్‌ను విసిరేసి వీరంగం సృష్టించారు. జేసీ చర్యతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. ఆయనపై ఉన్నతాధికారులకు ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు చేశారు.
 
కాగా, ఇటీవల ఎయిర్ ఇండియా మేనేజర్‌పై దాడి చేసిన వ్యవహారంలో శివసేన రవీంద్ర గైక్వాడ్‌ను విమానాల్లో ప్రయాణించకుండా ఎయిరిండియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని ప్రైవేటు విమాన సంస్థలు కూడా అమలు చేశాయి. దీంతో దిగివచ్చిన గైక్వాడ్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఆయనపై నిషేధం తొలగించారు. ఇపుడు ఎయిర్‌పోర్టులో దౌర్జన్యం చేసిన జేసీ దివాకర్ రెడ్డిపై కూడా ఇలాంటి చర్యలే తీసుకోవచ్చన్న పలువురు అభిప్రాయపడుతున్నారు.