జగన్‌లా తండ్రికి తలవంపులు తెచ్చే పని చేయను: నారా లోకేష్
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిలా తండ్రికి తలవంపులు తెచ్చే పని ఎన్నడూ చేయనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విజయవాడలోని కేఎల్ యూనివర్శిటీలో జరుగుతున్న శిక్షణ తరగతుల్లో కార్యకర్తల సంక్షేమంపై ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జగన్‌పై ఆయన విమర్శల వర్షం కురిపించారు. నాన్నతో నాకు విభేదాలని దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్‌లా చిన్నాన్నతో రాజీనామా చేయించి పదవులు దక్కించుకోవాలనే ఆలోచనలు నాకు రావని లోకేష్ తెలిపారు.
ఇకపోతే పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలేనన్నారు. వారిని పట్టించుకోని నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వబోమన్నారు. అంటే కార్యకర్తలను పట్టించుకోని నేతలను పార్టీ కూడా పట్టించుకోదన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముకలాంటి వారని చెప్పారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
తనతో సహా ఏ నేతకైనా సరే పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరి పనితీరుపై పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదికలు వెళుతున్నాయని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను అదే స్థాయిలో తిప్పికొట్టాలని సూచించారు.