మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 9 సెప్టెంబరు 2021 (10:29 IST)

ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్!

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో మ‌హిళ సామూహిక అత్యాచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌పై విరుచుకుప‌డ్డారు. 
 
జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. రాష్ట్రంలో మహిళల భద్రత పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలోనే, గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకోవడం బాధాకరం. గుంటూరు నుండి బైక్ పై సత్తెనపల్లి వెళ్తున్న జంటపై దాడి చేసి, మహిళ పై అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసింది. 
 
ఫిర్యాదు చెయ్యడానికి వెళితే మా లిమిట్స్ లోకి రాదు... వేరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి అని పోలీసులు చెప్పడం ఇంకా ఘోరం. ఇంత విచ్చలవిడిగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఆడబిడ్డని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించకుండా నన్ను అడ్డుకోవడానికి వేలాది మంది పోలీసుల్ని రంగంలోకి దింపారు. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్ని రాజకీయ కక్ష సాధింపులకి జగన్ రెడ్డి వాడుకోవడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్ప‌డింద‌ని నారా లోకేష్ విమ‌ర్శించారు.