1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:46 IST)

సీఎం జగన్‌కు టీడీపీ నేతల బహిరంగ లేఖల వెల్లువ‌!

వినాయక చవితి ఉత్సవాలపై టీడీపీ నేత‌లు వినూత్నంగా లేఖలు రాస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 175 నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు నేరుగా సీఎంకి లేఖ‌లు సంధించారు. గ‌ణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని లేఖలో టీడీపీ నేతలు కోరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, వేడుకల్లో పాల్గొంటామని, త‌మ‌ని అనుమ‌తించాల‌ని టీడీపీ నేతలు లేఖ‌లో కోరారు.
 
వినాయక చవితి ఉత్సవాలపై  ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ, సీఎం జగన్‌కు టీడీపీ నేతల బహిరంగ లేఖలు ఇపుడు కొత్త ప్ర‌యోగంగా మారింది. మూకుమ్మ‌డిగా 175 నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలను  నిషేధించడం భక్తుల మనోభావాలకు విరుద్ధమన్నారు.

గణేష్ ఉత్సవాలను  పొరుగు రాష్ట్రం తెలంగాణలో రద్దు చేయలేదని తెలిపారు. కరోనా సాకుతో మన రాష్ట్రంలోనే రద్దు చేయడం దారుణమన్నారు. గణేష్ ఉత్సవాలకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.