శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (11:27 IST)

ప్రపంచంలో అత్యధిక ప్రజాధారణ కలిగిన నేతగా ప్రధాని మోడీ

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభ వెలిగిపోతోంది. ప్రపంచంలోని 13 మంది నేతల్లో ఆయన అత్యధిక ప్రజాధారణ కలిగిన నేతగా ఎన్నికయ్యారు. అమెరికాకు చెందిన ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ అనే సంస్థ తాజాగా వెల్ల‌డించిన ఓ స‌ర్వే గణాంకాల ద్వారా ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. ప్రపంచంలోని 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీగా నిలిచారు. ప్రజల్లో 70 శాతం మంది ఆయ‌న‌పై ఆదరణ క‌న‌బ‌ర్చారు. అలాగే, సర్వేలో పాల్గొన్న వయోజనుల్లో 25 శాతం మంది మాత్రమే ఆయన పట్ల వ్యతిరేకత కనబ‌రిచారు. 
 
వారానికి ఒక‌సారి ఈ గణాంకాలను అప్ డేట్ చేస్తుంటారు. ఈ జాబితాలో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మేన్యుయెల్‌ లోపెజ్‌ ఓబ్రడార్‌, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి ఉన్నారు. అంత‌కు ముందు ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ వెల్ల‌డించిన ఫ‌లితాల్లోనూ ప్రజామోదంలో మోడీనే అగ్రస్థానంలో నిలిచిన విషయం తెల్సిందే.  
 
కాగా, గత 2019 ఆగస్టులో మోడీ ప్ర‌జాద‌ర‌ణ 82 శాతంగా ఉండగా, అది జూన్ నెలలో 66 శాతానికి తగ్గగా, ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న త‌న అగ్ర‌స్థానాన్ని ప‌దిలంగా ఉంచుకుంటూనే 70 శాతానికి దాన్ని మెరుగుప‌ర్చుకున్నారు. ఇక‌ అత్య‌ధిక మంది తిర‌స్క‌రిస్తోన్న ప్ర‌ధానిగా జపాన్‌ ప్రధాని సుగా నిలిచారు. ఆయ‌న‌ను 64 శాతం మంది వ్యతిరేకిస్తుండ‌డం గ‌మ‌నార్హం.