దేశ చరిత్రలో టోక్యో ఒలింపిక్స్ ప్రత్యేకమైనవి : ప్రధాని మోడీ
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ పోటీలు భారతదేశ చరిత్రలో ప్రత్యేకమైనవని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఈ ఒలింపిక్స్ పోటీల్లో పారాలింపిక్స్ పోటీలు ఇంకా ప్రత్యేకమైనవిగా నిలిచిపోతాయన్నారు.
ఆదివారంతో ముగిసిన పారాలింపిక్స్ పోటీల్లో భారత గతంలో ఎన్నడూ లేనంతగా 19 పతకాలను కైవసం చేసుకుంది. వీటిలో ఐదు స్వర్ణ పతకాలు ఉన్నాయి.
ఈ పోటీల్లో భారత అథ్లెంట్ల ప్రదర్శనపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రతి భారతీయుడి జ్ఞాపకాల్లో ఈ పారాలింపిక్స్ చెరగని ముద్రగా మిగిలిపోతాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భావి తరాల్లో చాలా మంది క్రీడలవైపు ఆకర్షితులయ్యేందుకు ఈ పారాలింపిక్స్ దోహదం చేస్తాయని చెప్పారు.
పారాలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందంలోని ప్రతి సభ్యుడు ఒక చాంపియన్ అని, భావి తరాల్లో ప్రేరణ కల్పించే ఒక వనరు అని ఆయన కొనియాడారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకే పారాలింపిక్స్‌లో మన పారాలింపియన్‌లు 19 పతకాలు గెలిచి మనందరి హృదయాలను పరవశింపజేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఈ విజయానికి దోహదపడిన కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌తోపాటు క్రీడాకారుల కుటుంబాలను ప్రధాని మెచ్చుకున్నారు. ఈ విజయం భవిష్యత్తులో క్రీడల్లో భాగస్వామ్యం పెరుగడానికి దోహదం చేస్తుందని ఆశిద్దామని పేర్కొన్నారు. అదేవిధంగా విజయవంతంగా ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహించిన జపాన్ ప్రభుత్వాన్ని ప్రధాని ప్రశంసించారు.