సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (10:20 IST)

తాగొచ్చి చిత్ర హింసలు.. భరించలేక కొడుకును సజీవదహనం చేసిన తల్లిదండ్రులు

పీకల వరకు మద్యం సేవించి వచ్చి చిత్ర హింసలు పెడుతున్న కన్న కొడుకుని ఆ తల్లిదండ్రులు సజీహదహనం చేశారు. నిత్యం ఇంట్లోనే నరకం చూపిస్తుండటంతో కడుపు తీపిని చంపుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన కడారి ప్రభాకర్, విమల అనే దంపతుల కుమారుడు కడాలి మహేష్ చంద్ర (42). ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, మద్యానికి బానిసైన చంద్ర నిత్యం పెట్టే వేధింపులు భరించలేక రెండు నెలల క్రితమే భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయంది.
 
ఈ క్రమంలో మహేష్ చంద్ర ఇంట్లోనే ఉన్న తల్లిదండ్రులను వేధించసాగాడు. రోజూ తాగివచ్చి కొడుతున్న కొడుకు తీరును తట్టుకోలేకపోయారు. మంగళవారం రాత్రి ఎప్పటిలాగే తాగివచ్చిన కొడుకు తమమీద చెయ్యి చేసుకోవడంతో ప్రభాకర్ దంపతులు ఎదురు తిరిగారు.
 
మద్యంమత్తులో ఉన్న చంద్రను పట్టుకుని తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకునేసరికి చంద్ర పూర్తిగా కాలిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.